దేశంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్ పర్వదినాన్ని జరుపుకొంటున్నారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు, తొలి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు.. దేవాలయాలకు పోటెత్తారు. ఈ పండగల సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని, పలువురు రాజకీయ నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
దేశంలోని ముస్లిం సోదరులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగం, మానవ సేవకు ప్రతీక అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. దేశ శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన తన సందేశంలో ప్రజలను కోరారు.దేశ ప్రజలకు బక్రీద్, ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. మానవ జాతి మంచి కోసం, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసేలా ఈ పండుగలు ప్రేరేపించాలని ఆయన ఆకాంక్షించారు. బక్రీద్ వేళ శాంతి, సంతోషం పరిఢవిల్లాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. బక్రీద్ వేళ భారత సరిహద్దు భద్రతాదళం, పాకిస్తాన్ రేంజర్లు అట్టారీ-వాఘా సరిహద్దుల్లో పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. మరోవైపు, దేశంలో ఘనంగా తొలి ఏకాదశి పర్వదినం జరుపుకొంటున్నారు ప్రజలు. ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెబుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.పండర్‌పుర్ విఠల్ రుక్మిణి ఆలయంలో పూజలు చేస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ ఏడాది జూలై 10న జరుపుకునే ఈద్ అల్-అధా లేదా బక్రా ఈద్, ‘త్యాగం యొక్క పండుగ’ అని కూడా పిలువబడే పవిత్ర సందర్భం. ఇస్లామిక్ 12వ నెల అయిన ధు అల్-హిజ్జా 10వ రోజున జరుపుకుంటారు. ఇది వార్షిక హజ్ యాత్ర ముగింపును సూచిస్తుంది. ప్రతి సంవత్సరం, ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్ ఆధారంగా తేదీ మారుతుంది, ఇది పాశ్చాత్య 365-రోజుల గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే దాదాపు 11 రోజులు తక్కువగా ఉంటుంది. ఈద్ అల్-అధా అనేది ఆనందం, శాంతికి చిహ్నం. ఇక్కడ ప్రజలు తమ కుటుంబాలతో జరుపుకుంటారు, గత పగలను విడిచిపెట్టి, ఒకరితో ఒకరు అర్ధవంతమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు. అబ్రహాం ప్రవక్త దేవుని కోసం సర్వస్వం త్యాగం చేసేందుకు సిద్ధపడినందుకు స్మారకంగా దీనిని జరుపుకుంటారు.