ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఇంతకీ ప్రియుడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో తెలుసా? ప్రియురాలితో జరిగిన వాగ్వాదమే. అది బాగా ముదరడంతో.. ప్రియుడు నొచ్చుకొని, బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా ధామశాలకు చెందిన 23 ఏళ్ల మనోజ్ కుమార్ బెహెరా.. కటక్‌లోని శ్రీశ్రీ యూనివర్సిటీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు జిల్లాలోని సంధాపూర్ గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సమీపంలోనే ప్రియురాలు అద్దె ఇంట్లో ఉంటోంది. వీళ్లిద్దరు తరచుగా వీడియో కాల్స్ మాట్లాడుతుంటారు. ఈ క్రమంలోనే వీళ్లు మంగళవారం సాయంత్రం 4 గంటలకు ల్యాప్‌టాప్‌లో వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు. తొలుత వీరి సంభాషణ సరదాగానే మొదలైంది. ఆ తర్వాత అది వాగ్వాదానికి దారి తీసింది. ఇద్దరూ తీవ్రంగా గొడవపడ్డారు. దీంతో.. మనోజ్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ప్రియురాలు వీడియో కాల్‌లో ఉండగానే.. మనోజ్ తన ఇంటి డోర్ లాక్ చేశాడు. గదిలోని రూఫ్‌కు ఉరి వేసుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇది చూసి ఖంగుతిన్న యువతి, వెంటనే ప్రియుడి ఇంటి వద్దకు వెళ్లింది. బోరున ఏడుస్తూ.. తలుపులు గట్టిగా కొట్టింది. ఇది గమనించిన స్థానికులు.. తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లారు. ఉరికి వేలాడుతున్న మనోజ్‌ని కిందకు దించి, ఆసుపత్రికి తరలించారు. అయితే.. అతడు అప్పటికే మరిణించినట్టు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలేంటో తెలుసుకోవడం కోసం, యువతిని ప్రశ్నిస్తున్నారు.