లాలూకు షాక్.. బలనిరూపణ రోజే ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు..

0
143

ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వం బలనిరూపణ రోజే బీహార్ లో సీబీఐ రంగంలోకి దిగింది. పలువురు ఆర్జేడీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది సీబీఐ. బుధవారం రోజు తెల్లవారుజామున ఆర్జేడీ నేతల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. యూపీఏ 1 గవర్నమెంట్ లో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేసిన కాలంలో వెలుగులోకి వచ్చిన ‘ఉద్యోగాల కోసం భూములు’ స్కామ్ లో ముగ్గురు ఆర్జేడీ సీనియర్ నేతల ఇళ్లలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దాడులు చేసింది.

ఆర్జేడీకి చెందిన రాజ్యసభ ఎంపీ అహ్మద్అష్ఫాక్ కరీం, ఎమ్మెల్సీ సునీల్ సింగ్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ సుబోధ్ రాయ్ ఇళ్లలో సీబీఐ బృందాలు సోదాలు చేశాయి. బుధవారం ఉదయం నుంచే వీరిద్దరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది సీబీఐ. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడిగా అభివర్ణించారు సునీల్ సింగ్. ఆర్జేడీ ఎమ్మెల్యే భయపడి బీజేపీతో చేరుతారనే ఆశతో ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు. ఇది బీజేపీ దాడి అని.. ఈడీ, సీబీఐ, ఐటీలు బీజేపీ కింద పని చేస్తున్నాయని.. బీజేపీ స్క్రిప్టుతోనే నడుస్తున్నాయని.. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా విమర్శించారు.

ఇటీవల బీహార్ లో బీజేపీ పొత్తును వీడి జేడీయూ, ఆర్జేడీతో పొత్తు పెట్టుకుంది. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం రోజు నితీష్ కుమార్ బీహార్ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోనున్నారు. ఇదే రోజు సీబీఐ దాడులు చేయడాన్ని ఆర్జేడీ విమర్శిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు చేయిస్తోందని విమర్శించింది. లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న 2004-09 సమయంలో లాలూ కుటుంబ సభ్యులు రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూములను లంచంగా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీబీఐ ఆర్జేడీ నేతల ఇళ్లపై దాడులు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here