తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పట్లో నియోజకవర్గాల పెంపు లేనట్లే అని తేల్చి చెప్పింది. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని ఇటు రాజకీయ పార్టీలు భావించాయి. అయితే వీటన్నింటిపై కేంద్ర పార్లమెంట్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు లేనట్లే అని.. నియోజవర్గాల పెంపు కోసం 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని అన్నారు. ఈ నిర్ణయం రాజకీయ పార్టీ ఆశలపై నీళ్లు పోసినట్లే అయింది. ఇన్నాళ్లు రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను పెంచితే..రాజకీయంగా బలపడటంతో పాటు పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం కల్పించవచ్చని అధికార పార్టీలు భావించాయి. అయితే 2026 వరకు అసెంబ్లీ సీట్లు పెరగవని కేంద్రం స్పష్టత ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్తాయో చూడాలి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని నిబంధన గురించి బీజేపీ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ. నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 26 (1) రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి , పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 15కి పక్షపాతం లేకుండా (లోబడి), శాసనసభ సీట్ల సంఖ్య కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో 175 మరియు 119 నుండి 225 మరియు 153కి వరుసగా పెంచాలని సూచిస్తున్నాయి. కాగా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం, 2026 సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించే వరకు ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్యను తిరిగి సర్దుబాటు చేయరాదని మంత్రి పేర్కొన్నారు. విభజన చట్టానికి అనుగుణంగా ..రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించే వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచలేమని మంత్రి సమాధానంలో స్పష్టం చేశారు.