ఇండియా, చైనా సైనికుల మధ్య జరిగిన గల్వాన్ ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులకు చెక్కులు పంపిణీ చేశారు సీఎం కేసీఆర్. బీహర్ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో అందించారు. ఇదే విధంగా హైదరాబాద్ అగ్నిప్రమాదంలో మరణించిన 12 మంది కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. గాల్వాన్ లో వీరసైనికుల త్యాగం ఎంతో గొప్పదని.. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం మన బాధ్యతని.. వలస కూలీలను తెలంగాణ ప్రగతి ప్రతినిధులుగా భావిస్తామని.. చనిపోయిన వలస కూలీల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలనుకున్నాం అని సీఎం కేసీఆర్ అన్నారు.
అంతకు ముందు బుధవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కేసీఆర్ బీహార్ రాజధాని పాట్నాకు చేరుకున్నారు. పాట్నాలో సీఎం కేసీఆర్‌ను ఘనంగా స్వాగతించారు సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్. ఇటీవల బీహార్ లో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన జేడీయూ.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇన్నాళ్లు బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న సీఎం నితీష్ కుమార్ జేడీయూ పార్టీ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చింది. ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న నితీష్ కుమార్.. ఎనిమిదో సారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. సీఎం కేసీఆర్ బీహర్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా వీరి మధ్యలో రాజకీయం చర్చకు రానుంది. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఎలా మందుకు వెళ్లాలనే దానిపై నేతలు సమాలోచన చేయనున్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కలిసి రావాలని గతం నుంచి సీఎం కేసీఆర్ చెబుతున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి అభ్యర్థిగా సీఎం నితీష్ కుమార్ సరైన వ్యక్తి అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పలు మార్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ, మోదీ పాలన కేంద్రంగానే చర్చలు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.