మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై మౌనం వీడారు శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే.. శివసేన పార్టీ, రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కరోనా బారినపడిన ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండగా.. అక్కడి నుంచే మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.. తాను కోవిడ్ బారినపడ్డాను.. కానీ, ఎలాంటి లక్షణాలు లేవని.. హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు.. అయితే, హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయని స్పష్టం చేసిన ఆయన.. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే సీఎంగా తప్పుకుంటానని ప్రకటించారు. సొంత ఎమ్మెల్యేలే వద్దనడం బాధగా ఉందన్నారు.. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే రాజీనామా చేసేందుకు సిద్ధమని.. నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని తెలిపారు ఉద్దవ్ థాక్రే.. రాజకీయ సంక్షోభంలో ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఉద్దవ్.. అంతేకాదు, శివసేన చీఫ్‌గా దిగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని.. తాను చేసిన తప్పేంటో చెప్పాలని రెబల్ ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు ఉద్దవ్. ఇక, తిరుగుబాటు చేసిన మంత్రి ఏక్‌నాథ్ షిండేతో పాటు రెబల్ ఎమ్మెల్యేలను చర్చలకు ఆహ్వానించారు ఉద్దవ్ థాక్రే, నేను నమ్మక ద్రోహానికి గురయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. నాతో ఏక్‌నాథ్ షిండే నేరుగా మాట్లాడాలని సూచించారు.. ఇక, శివసేన సైనికుడు ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు అని వ్యాఖ్యానించారు. అయితే, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి మాత్రం సిద్ధంగా లేనని స్పష్టం చేశారు..
మరోవైపు, ఏక్‌నాథ్ షిండే తమ నాయకుడని ప్రకటిస్తూ రాష్ట్ర గవర్నర్, శాసనసభ ఉపాధ్యక్షుడికి లేఖ రాశారు 34 మంది రెబల్ ఎమ్మెల్యేలు, అంతేగాకుండా, ఏకనాథ్ షిండేను శివసేన శాసనసభాపక్ష నాయకుడుగా నియమిస్తూ తీర్మానం కూడా చేశారు.. సిద్ధాంతపరంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలపడం పట్ల శివసేన కార్యకర్తల్లో విపరీతమైన అసంతృప్తి, వ్యతిరేకత వచ్చిందని తీర్మానంలో పేర్కొన్నారు.. అయితే, 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలతో పాటు, ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా రెబల్ నేత ఏక్‌నాథ్ షిండేకు మద్దతుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.. శివసేన బలం 55 మంది ఎమ్మెల్యేలు కాగా.. 40 మంది తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు రాజీనా చేస్తే.. ఆ పార్టీ బలం 15కు పడిపోనుంది.. దీంతో, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కునే సాహసం చేయడం లేదు శివసేన చీఫ్.. మొత్తంగా బీజేపీకి బైబై చెప్పి.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్దశ్ థాక్రేకు తాజా పరిణామాలు ఇబ్బందిగా మారాయి.