ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా అన్నట్టుగా కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల పంట పండింది. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి దుమ్మురేపింది భారత్. మన ఖాతాలో బంగారు పతకాలు వచ్చి చేరాయి. మొత్తం 61 పతకాలతో భారత్ టాప్4లో నిలిచింది. ఇందులో ఏకంగా 22 బంగారు పతకాలుండడం విశేషం.
కామన్వెల్త్ చరిత్రలో మొత్తం 200 పతకాల్ని గెలుచుకుంది భారత్. ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 61 పతకాలు సాధించింది. వీటిలో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. భారతదేశానికి అత్యధిక పతకాలు రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లో వచ్చాయి. రెజ్లింగ్‌లో భారత రెజ్లర్లు 12 పతకాలు సాధించగా.. వెయిట్‌లిఫ్టర్లు 10 పతకాలు సాధించారు. బాక్సింగ్‌లోనూ భారత్‌కు 7 పతకాలు వచ్చాయి. అదే సమయంలో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు 3 బంగారు పతకాలు వచ్చాయి. ఆస్ట్రేలియా 177 పతకాలు, 66 స్వర్ణాలు, 57 రజతాలు, 54 కాంస్యాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ 172 పతకాలతో రెండో స్థానంలో ఉండగా.. 92 పతకాలతో కెనడా మూడో స్థానంలో నిలిచింది.