కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. గులాం నబీ ఆజాద్ రాజీనామా..

0
110

ఓ వైపు అధ్యక్ష ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో మూలస్తంబంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేశారు. పార్టీ తీరుపై గత కొంత కాలంగా ఆజాద్ అసంతృప్తిగా ఉంటున్నారు. ఇటీవల కాశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్ గా గులాం నబీ ఆజాద్ ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. అయితే ఈ నియామకం జరిగిన కొద్ది సేపటికే ఆయన ఈ పదవి నుంచి వైదొలిగారు. తాజాగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీకే రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను పంపారు.

జమ్మూ కాశ్మీర్ లో మంచి పట్టు ఉన్న గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. 1973లో జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ బ్లాక్ కమిటీ మెంబర్ గా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. 2005-08 మధ్య ఆయన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గా పనిచేశారు.

కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లోపం, సంస్థాగత మార్పులపై గతంలో గులాం నబీ ఆజాద్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. జీ -23 పేరుతో సీనియర్లు అంతా పార్టీలో సమూల మార్పులు రావాలని కోరారు. ఇందులో కీలకంగా గులాం నబీ ఆజాద్ వ్యవహరించారు. తన రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీకి రాసిన లేఖలో రాహుల్ గాంధీ వ్యవహార శైలిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనం అయిందని ఆరోపించారు. పార్టీలో సంప్రదింపులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సీనియర్లను పక్కన పెట్టారని లేఖలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here