పోలీస్‌ స్టేషన్‌లోనే కానిస్టేబుల్‌పై దాడి.. వీడియో వైరల్

0
109

సాధారణంగా ప్రజలపై ఎవరైనా దౌర్జన్యం చేస్తే ఏం చేస్తారు.. పోలీస్‌ స్టేషన్‌కు పరిగెడతారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు మొరపెట్టుకుంటారు. కానీ అలాంటి పోలీసులపైనే దౌర్జన్యం జరిగితే.. ఇక ప్రజల పరిస్థితి ఏంటి?. ఢిల్లీలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఈ అనుమానాలను రేకెత్తిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఓ అల్లరి మూక ఏకంగా ఆనంద్ విహార్‌ పోలీసు స్టేషన్‌లోకి చొరబడి కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడింది. కానిస్టేబుల్‌పై దాడి చేస్తున్నప్పటికీ.. తోటి పోలీసులు చోద్యం చూడటం గమనార్హం. కానిస్టేబుల్‌పై దాడి చేయడం.. తనను విడిచిపెట్టమని ఆ కానిస్టేబుల్ చేతులెత్తి వేడుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు. అడ్డుకోకుండా పోలీసులే ఈ దాడిని వీడియో తీయడం విస్మయానికి గురిచేస్తోంది.

స్టేషన్‌లోకి 10, 12 మంది వ్యక్తులు ప్రవేశించి.. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. విచక్షణ రహితంగా కొట్టారు. అయితే అక్కడున్నవారు ఎవరూ దానిని ఆపేందుకు ప్రయత్నించలేదు. దాంతో ఆ కానిస్టేబుల్ చేతులెత్తి.. తనను విడిచిపెట్టమని కోరాడు. అయినా సరే ఎవరూ కనికరించలేదు. ఈ అవమానకరమైన సంఘటన ఆగస్ట్ 3వ తేదీన జరిగినట్టు తెలుస్తుంది. ఆ బాధితుడు హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్‌గా తెలుస్తుంది. వీడియోలు వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఈ విషయాన్ని వారు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, నిందితులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు శనివారం ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన వ్యక్తి సతీష్ కుమార్ (29) ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్కర్దూమా నివాసి. సతీష్ వృత్తిరీత్యా న్యాయవాది అని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here