కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం

0
71

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్రం. డియర్‌నెస్ అలవెన్స్‌(డీఏ)ను 4 శాతం పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దసరా ముందు కేంద్ర డీఏ పెంచడంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల దేశంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ 34 శాతంగా ఉంది. తాజాగా 4 శాతం పెంచడంతో ఇది 38 శాతానికి చేరుతుంది. దీని వల్ల 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు లాభం చేకూరుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బేసిక్ జీతం ఆధారంగా డీఏ అనేది లెక్కిస్తారు. డీఏ పెరుగుదల వల్ల ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. సాధారణంా డీఏను ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు సవరిస్తుంది. జనవరిలో ఒకసారి, జూలైలో మరోసారి సవరిస్తుంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచడం వల్ల ఏడాదికి అదనంగా రూ. 6,591.36 కోట్ల భారం పడనుంది. గత మార్చిలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) 31 శాతం నుండి 34 శాతానికి పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది జనవరి 1, 2022 అమలులోకి వచ్చింది.

దీంతో పాటు కేంద్ర మంత్రి మండలి రైల్వే పునరాభివృద్ధి ప్రాజెక్టుకు కూడా ఆమోదం తెలిపింది. రైల్వే ఉద్యోగులకు ప్రొడక్షన్ లింక్డ్ బోనస్ ను క్యాబినెట్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రతిపాదనను కూడా ఆమోదించినట్లు తెలుస్తోంది. దీని వల్ల 11 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారని అంచనా.. రైల్వేపై రూ. 2000 కోట్ల భారం పడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here