తనపై జరిగిన దాడులన్నీ రాజకీయమేనని, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన ఉల్లంఘనలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. వచ్చే 3-4 రోజుల్లో సీబీఐ-ఈడీ తనను అరెస్టు చేసే అవకాశం ఉందని.. తాము భయపడబోమన్నారు. 2024 ఎన్నికలు ఆప్ వర్సెస్ బీజేపీ అని సిసోడియా అన్నారు. న్యూయార్క్ టైమ్స్‌లో ఢిల్లీ విద్యా విధానంపై ఆర్టికల్ రాశారని సిసోడియా వెల్లడించారు. ఇది తన ఒక్కరి వల్ల సాధ్యం కాలేదని.. టీచర్ల ద్వారా విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందన్నారు. నిన్న తన నివాసంతో పాటు సచివాలయం కార్యాలయంలో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారన్నారు. దేశంలోనే బెస్ట్ ఎక్సైజ్ పాలసీ.. ఢిల్లీ సర్కారు పాలసీ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పూర్తిగా పారదర్శకంగా పాలసీని రూపొందించామన్నారు. చాలా మంది తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయని సీబీఐ చెప్పింది..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరగలేదన్నారు. బీజేపీ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తోందని.. ఆయనకు పెరుగుతున్న మద్దతును జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్‌ను నిలవరించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. తానేం తప్పు చెయ్యలేదన్నారు. కేజ్రీవాల్ సర్కార్‌లో మంత్రిని కాబట్టే తనపై సీబీఐ దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి చర్యలు మోడీకి శోభ తీసుకురావని విమర్శించారు. మోడీ కరోడ్ పతిల కోసం పని చేస్తారని.. కేజ్రీవాల్ పేదల కోసం పని చేస్తారని సిసోడియా పేర్కొన్నారు. రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేందుకు మోడీ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మేం భగత్ సింగ్ వారసులం.. మమ్మల్ని ఏం చెయ్యలేరని స్పష్టం చేశారు. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని మనీష్ సిసోడియా పేర్కొన్నారు.