ఉద్యోగం చేస్తానన్న కోడలు.. వద్దంటూ ఇటుకతో మామ ఎటాక్

0
38

తన భర్తకు ఆర్థికంగా సహాయం అందిద్దామన్న ఉద్దేశంతో ఓ మహిళ ఇంటర్వ్యూకి బయలుదేరగా.. వద్దంటూ ఆమెని వెంబడించి మరీ ఇటుకతో తల బద్దలుకొట్టాడు ఓ మామ. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లో కాజల్ అనే మహిళ.. తన భర్త ప్రవీణ్ కుమార్‌తో కలిసి అత్తారింట్లో ఉంటోంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో.. ఉద్యోగం చేయాలని కాజల్ నిర్ణయించుకుంది. ఇందుకు భర్త ప్రవీణ్ కూడా సమ్మతం తెలిపాడు.

కానీ.. అత్తామామలు మాత్రం కాజల్ నిర్ణయాన్ని నిరాకరించారు. ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేసుకుంటే చాలని చెప్పారు. కాజల్ ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. అత్తామామలు వినిపించుకోలేదు. ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు. అయితే.. భర్త సంపాదిస్తున్న జీతంతో కుటుంబాన్ని పోషించడం కష్టమవుతుండటంతో, కాజల్ ఉద్యోగానికి వెళ్లాలని డిసైడ్ అయ్యింది. బుధవారం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేందుకు, ఇంటి నుంచి బయలుదేరింది.

దీంతో కోపాద్రిక్తుడైన మామ.. కాజల్‌ని వెంబడించి, ఒక చోట ఆమెని అడ్డగించి, ఇటుకతో దాడి చేశాడు. మామ నుంచి తప్పించుకోవడానికి కాజల్ ప్రయత్నించినా.. అతడు వెంటాడుతూ దాడికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ దాడిలో కాజల్ తలకు తీవ్ర గాయమైంది. భర్త ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. తలకు 17 కుట్లు పడ్డాయి. కాజల్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. ఆమె మామపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here