స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీకి షాక్ ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. ఇటీవల హైదరాబాద్ లో ప్రదర్శన నిర్వహించి వార్తల్లో నిలిచారు మునావర్ ఫరూఖీ. అయితే ఆగస్టు 28న ఢిల్లీలో షో నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. షోకు అనుమతిస్తే మతపరమైన ఉద్రిక్తతతలు ఏర్పడే అవకాశం ఉండటంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే షోకు అనుమతి ఇస్తే అడ్డుకుంటామని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో.. ఆగస్టు 28న జరగాల్సిన మునావర్ ఫరూఖీ షో రద్దు అయ్యే అవకాశం ఏర్పడింది. ఇదే నెలలో బెంగళూర్ పోలీసులు కూడా ఇదే విధంగా మునావర్ షోకు అనుమతి ఇవ్వలేదు. అయితే హైదరాబాద్ లో మాత్రమ ఆయన కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఈ షో జరిగింది.
గతంలో మునావర్ ఫరూఖీ హిందూ దేవతలపై వ్యాఖ్యలు చేయడంతో అప్పటి నుంచి ఆయన ప్రదర్శనలు శాంతిభద్రతల సమస్యలుగా మారాయి. పలు హిందూ సంస్థలతో పాటు బీజేపీ కూడా మునావర్ ఫరూఖీ ప్రదర్శనలను వ్యతిరేకిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మునావర్ ఫరూఖీ ప్రదర్శన మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ షోను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. షోను అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్త్ మధ్య ప్రదర్శనను నిర్వహించారు.
మునావర్ ఫరూఖీ హైదరాబాద్ షోకు వస్తే వేదికను తగలబెడతామని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేశారు. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రదర్శన అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ముస్లింలు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలంటూ నిరసన తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్ ను బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. మునావర్ ఫరూఖీ హైదరాబాద్ షోకు అనుమతించిన క్రమంలోనే ఈ ఉద్రికత్తలు చెలరేగాయని.. దీంతో ఢిల్లీ ప్రదర్శనకు అనుమతి నిరాకరించారు పోలీసులు.