దేవుడిపై భక్తి, భయం ఉండడం సర్వసాధారణమే. కానీ ఆ భక్తిని పూజలు చేయడం ద్వారా, నోములు, వ్రతాలు చేయడం, కోరిన కోర్కెలు నెరవేరితే ఘనంగా ఉత్సవాలు చేయడం వంటివి మనం నిత్యం చూస్తూ ఉంటాం. కానీ ఓ భక్తులు తన కోరిక నెరవేరిందని దేవుడికి ఏకంగా తన నాలుకను కోసి సమర్పించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కౌశాంబికి చెందిన సంపత్(32) అనే భక్తుడు మా శీత్లా ఆలయంలో తన నాలుకను కోసుకుని దేవుడికి సమర్పించినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు.
అధిక రక్తస్రావం కావడంతో అతడిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. సంపత్, అతని భార్య బన్నో దేవి గంగా నదిలో స్నానం చేసి పూజలు చేసిన ఆలయానికి వచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత, అతను తన నాలుకను బ్లేడుతో కోసుకుని ఆలయ ప్రధాన ద్వారం వద్ద సమర్పించినట్లు కర్హాధామ్ పీఎస్ హౌస్ ఆఫీసర్ అభిలాష్ తివారీ వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆలయాన్ని సందర్శించాలని తన భర్త కోరికను వ్యక్తం చేసినట్లు దేవి తెలిపింది. దేవుడిపై భక్తి కన్నా వీరిలో మూఢ నమ్మకాల ప్రభావం ఎక్కువగా ఉండటంవల్ల ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి ఏకంగా తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారని పోలీసులు తెలియజేశారు.