కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన యజమాని కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం అవుతుంది. యజమానులకు ఏమైనా జరిగితే తట్టుకోలేదు. సరిగ్గా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. తన యజమాని ప్రాణాలను కాపాడేందుకు తాను ప్రాణ త్యాగం చేసింది. మరణించి హీరోగా నిలిచింది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని ప్రతాప్ పుర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. విషపూరితమైన పాము నుంచి యజమానిని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది.
జిల్లా పంచాయతీ సభ్యుడు అయిన అమిత్ రాయ్ ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీ జిల్లాను అనుకుని ఉన్న మధ్యప్రదేశ్ లోని ప్రతాప్ పురలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అమిత్ తన కుక్కతో కలిసి వెళ్తుండగా.. రక్తపింజరి పాము దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో అమిత్ రాయ్ కుక్క( గబ్బర్) పాముతో పోరాడింది. పాము కాటేయడంతో కుక్క చనిపోయింది.
కుక్కలంటే ఎక్కువగా ఇష్టపడే అమిత్.. ఐదేళ్ల క్రితం అమెరికాకు చెందిన కుక్కను తీసుకువచ్చి గబ్బర్ అని పేరు పెట్టాడు. అమిత్ ను ఎల్లప్పుడు అంటిపెట్టుకుని ఉండేది గబ్బర్. అమిత్ అనుమతి లేకుండా ఎవరిని కూడా తన అతని దగ్గరకు రానిచ్చేది కాదు. బుధవారం నాడు అమిత్ తన కుక్కతో కలిసి ప్రతాప్ పురాలోని తన ఫామ్ హౌజుకు వాకింగ్ కు వెళ్లాడు. అమిత్ కు తెలియకుండా అతని దగ్గరకు వస్తున్న రక్త పింజరిని గుర్తించి.. దాన్ని చంపేసింది. ఈ క్రమంలో పాము కాటుకు గురైంది. గబ్బర్ మరణంతో అమిత్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు