ఇంట్లో నోట్ల గుట్టలు.. బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్

0
140

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉపాధ్యాయ రిక్రూట్‌మెంట్ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని అరెస్టు చేసింది. మంత్రి సన్నిహితుడి నుంచి రూ. 20 కోట్లు స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత అరెస్టు జరిగింది. నగదు రికవరీ కావడంతో తృణమూల్ నేతను రాత్రంతా విచారించారు. విచారణ సమయంలో ఛటర్జీ అధికారులకు సహకరించలేదు. ఈ కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. అతని సన్నిహిత సహచరురాలు అర్పితా ముఖర్జీ ప్రాంగణంలో రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ దాడుల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.

ఈ మొత్తం ఎస్సెస్సీ స్కామ్‌లో వచ్చిన డబ్బుగా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అర్పితా ముఖర్జీ ఇంట్లో ఎక్కడ చూసినా రూ.500ల రూ.2 వేల నోట్ల కట్టలే దర్శనమిచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని స్కూల్ సర్వీస్ కమిషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్ రిక్రూట్మెంట్ స్కామ్‌ విచారణలో కీలక పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. 20కి పైగా మొబైల్ ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఛటర్జీతో పాటు విద్యాశాఖ సహాయ మంత్రి పరేష్‌ సి అధికారి, ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్య తదితరుల నివాసాలపై కూడా ఈడీ దాడులు చేసింది.

స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్ల నుంచి కీలక పత్రాలు, అనుమానాస్పద కంపెనీల సమాచారం, ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీ, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. అధికార పార్టీ టీఎంసీకి సంబంధించిన కీలక నేత, మాజీ మంత్రి అరెస్టు కావడం రాష్ట్రంలో కలకలం రేపింది.పరిశ్రమలు, వాణిజ్య శాఖలతో పాటు పార్థ ఛటర్జీ.. టీఎంసీ సెక్రటరీ జనరల్‌గానూ వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖ అవినీతితో పాటు తన శాఖల్లోనూ ఆయన అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here