మందుకొట్టి స్కూల్‌కు పంతులమ్మ.. దొరికిపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని హంగామా 

0
136

విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన ఓ ఉపాధ్యాయురాలు దాదాపు 25 ఏళ్లుగా ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. తన జీవితంలో వేలాదిమందికి విద్యాబుద్ధులు నేర్పారు. కానీ ఐదేళ్ల క్రితం ఏమైందో ఏమో.. మద్యానికి అలవాటు పడ్డారు. అక్కడితో ఆగకుండా.. నేరుగా పాఠశాలకే మద్యం బాటిళ్లు తీసుకొచ్చి తాగి పాఠాలు చెప్పేవారు. నిత్యం మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను కారణం లేకుండానే కొట్టడం, తిట్టడం, సహ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. విసిగిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయురాలు గంగలక్ష్మమ్మకు ఎన్నిసార్లు తప్పును సరిదిద్దుకోవాలని హెచ్చరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చివరికి తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేసి ఉపాధ్యాయురాలికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. అయినా ఆమె తీరు మారలేదు. చివరికి అధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా దొరికిపోయి సస్పెండయ్యారు.

ఆమె పేరు గంగలక్ష్మమ్మ. కర్ణాటకలోని తుముకూరు తాలూకా చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ప్రతి రోజూ ఆమె మద్యం తాగి స్కూలుకు రావడం, విద్యార్థులను చితకబాదుతుండడంతో విసిగిపోయిన తల్లిదండ్రులు తాజాగా స్కూలుకు చేరుకుని  పాఠశాలకు తాళం వేశారు. ఆపై టీచర్ గంగలక్ష్మమ్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలిసిన తాలూకా విద్యాధికారి (బీఈవో) హనుమానాయక్‌కు గ్రామస్థులు పరిస్థితిని వివరించారు. దీంతో స్కూలు లోపలికి వెళ్లి ఉపాధ్యాయిని టేబల్ డ్రా తెరిచేందుకు ప్రయత్నించగా ఆమె అడ్డుకున్నారు. గ్రామస్థులు టేబుల్‌ డ్రాకు ఉన్న తాళాలు పగలగొట్టి చూడగా అందులో ఓ మద్యం సీసా, మరో రెండు ఖాళీ సీసాలు లభించాయి. ఈ పరిణామంతో గంగలక్ష్మమ్మ తీవ్ర ఆగ్రహంతో తన గదిలోకి వెళ్లి తాళాలు వేసుకుని ఆత్మహత్య చేసుకొంటానని హంగామా సృష్టించారు. అనంతరం పోలీసులు అక్కడికి వచ్చి మద్యం సీసాలను జప్తు చేశారు. ఉపాధ్యాయురాలు గంగలక్ష్మమ్మను సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here