ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మహిళలకు ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించారు. మహిళలకు రక్షాబంధన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకు 48 గంటలు అంటే రెండు రోజుల పాటు ఉచిత బస్సు ప్రయాణాలను బహుమతిగా ఇవ్వనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఆగస్టు 10-12 వరకు మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందనున్నారు. దీంతో రాష్ట్రంలో 8 లక్షల మంది మహిళలు ఈ సేవలను పొందనున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలను కల్పించడం ఇదే మొదటిసారి కాదు. యూపీలో ప్రతీ ఏడాది కూడా రక్షాబంధన్ వేడుకలను పురస్కరించుకుని ఉచిత ప్రయాణాలను కల్పిస్తోంది ప్రభుత్వం. ఆగస్టు 10 అర్థరాత్రి నుంచి ఆగస్టు12 అర్థరాత్రి వరకు ఈ సౌకర్యం ప్రత్యేకంగా మహిళలకు కల్పించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా మహిళలకు రెండు రోజుల పాటు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది యోగి సర్కార్. ఈ విషయాన్ని సీఎం యోగీ ఆఫీస్ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. మహిళా రక్షణ కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రక్షా బంధన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తుందని పేర్కొంది.