చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన గోల్డెన్ జాయింట్‌ను శనివారం ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. కశ్మీర్ రైల్వే ప్రాజెక్ట్‌లోని ఉదంపుర్-శ్రీనగర్-బారాముల్లా మార్గంలో ఈ బ్రిడ్జి ఉంది. కత్రా-బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ వంతెన కీలకమైన అనుసంధానంగా నిలుస్తోంది. ఈ వంతెనను గోల్డెన్ జాయింట్‌గా పిలుస్తున్నారు. ఈ వంతెన చివరల నుంచి ఒక విల్లు ఆకారంలో ఉన్న నిర్మాణం.. బ్రిడ్జి మధ్యలో కలుసుకుంటుంది. దేశంలోని ఇతర ప్రాంతాలకు కశ్మీర్‌ను అనుసంధానం చేసే ఉద్దేశంతో కేంద్రం ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. ఆ రాష్ట్రంలోని రియాసి జిల్లాలో 1.3కిమీ పొడవున్న చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను మోడీ ప్రభుత్వం నిర్మించింది. ఈ వంతెన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
2002లో ఈ బ్రిడ్జి్ నిర్మాణ పనులు ప్రారంభమైనా.. కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా నిలిచిపోయాయి. మళ్లీ 2017 నవంబర్‌లో మెయిన్ ఆర్చ్ పనులు ప్రారంభమయ్యాయి. 2019 చివరినాటికి పూర్తి చేయాలని అధికారులు భావించినా..2018లో కాంట్రాక్టు సమస్యల కారణంగా జాప్యం జరిగింది. కరోనా వల్ల మరింత ఆలస్యమైంది. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 1,315 మీటర్లు. 17 వ్యాసార్థాలల్లో దీనిని నిర్మించారు. ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా రైల్వే సెక్షన్‌లో ఈ లైన్‌ను రూ.1,486 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ బ్రిడ్జి జమ్మూ కశ్మీర్‌లోని బక్కల్, కౌరి మధ్య చీనాబ్ నదిపై అనుసంధానంగా ఉంటుంది. ఈ వంతెన గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులను కూడా తట్టుకోగలదు. దీని జీవిత కాలం 120 సంవత్సరాలు ఉంటుంది.
ఈ బ్రిడ్జి బరువు బరువు 10,619 మెగా టన్నులు అని తెలిపారు. ఈ వంతెన నిర్మాణంలో 28,660 మెగా టన్నుల ఉక్కును వినియోగించారు. ఈ బ్రిడ్జి మొత్తం 7 పిల్లర్లను కలిగి ఉండగా సంగల్‌దాన్ వద్ద ఉన్న పిల్లర్ అన్నింటికన్నా ఎత్తులో 103 మీటర్లు ఉంటుంది. దీన్ని ఆఫ్కాన్స్ సంస్థ నిర్మించింది. ఈ ప్రాజెక్టు ఎన్నో అవాంతరాలు దాటుకుని ఇప్పుడు పూర్తయింది. కుతుబ్‌మినార్ కంటే ఎత్తైన ఈ నిర్మాణం.. బంగీ జంపింగ్ లాంటి సాహసోపేతమైన క్రీడలకు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. ఈ వంతెన పర్యాటకంగా జమ్ముకశ్మీర్‌ను మరింత ఉన్నత స్థితిలో ఉంచుతుందని తెలిపారు. చీనాబ్ వంతెనతో పాటు జమ్మూ కశ్మీర్‌లోని ప్రమాదకరమైన భూభాగంలో కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్) కోసం ఆఫ్కాన్స్ 16 అదనపు రైల్వే వంతెనలను నిర్మిస్తోంది. అన్ని వంతెనలు ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం కశ్మీర్ నుంచి ఢిల్లీకి సరకు రవాణా ట్రక్కులకు 48 గంటల సమయం పడుతుండగా.. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే రైళ్ల ద్వారా కేవలం 20 గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.