శ్రీనగర్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( ఎన్ఐటీ) విద్యార్థులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉండటంతో కొన్ని ఆదేశాలను జారీ చేసింది. విద్యార్థులు గ్రూపులగా మ్యాచ్ చూడద్దని.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయవద్దని స్టూడెంట్స్ వెల్ఫెర్ డీన్ నోటీసులు జారీ చేశారు. ఎన్ఐటీ విద్యార్థులు మ్యాచ్ సమయంలో తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని వర్సిటీ అధికారులు కోరారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వారి వారి గదుల్లోనే విద్యార్థులు ఉండాలని.. ఇతర విద్యార్థుల గదుల్లోకి ప్రవేశించడానికి.. గ్రూపులుగా ఏర్పడి మ్యాచ్ చూడటానికి అనుమతి లేదని ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. హస్టల్ నుంచి డిబార్ చేస్తామని.. విద్యార్థులకు రూ.5,000 చొప్పున జరిమానా విధిస్తామని ఎన్ఐటీ తెలిపింది. సోషల్ మీడియా వేదికగా మ్యాచ్ కు సంబంధించి ఎలాంటి పోస్టు చేయకూడదని విద్యార్థులను ఆదేశించారు. 2016లో టీ20 వరల్డ్ కప్ సెమీ-ఫైనల్ లో వెస్టిండీస్ తో భారత్ ఓడిపోయిన తర్వాత స్థానిక, ఇతర ప్రాంతాల విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. దీంతో ఆ సమయంలో కొన్ని రోజుల పాటు ఎన్ఐటీని మూసివేయాల్సి వచ్చింది. గ్రూపులుగా చూస్తున్న సమయంలో ఎవరైనా విద్యార్థులు ఇతర దేశాలకు మద్దతు తెలిపినా.. వారికి అనుకూలంగా నినాదాలు చేసినా.. పరిస్థితి కట్టుతప్పే అవకాశం ఉండటంతో ఎన్ఐటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచు పైనే ప్రధాన చర్చ జరుగుతోంది. చాలా రోజుల తర్వాత ఆసియా కప్ లో ఇరు దేశాలు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే టీ20 మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం జరిగే మ్యాచ్ కోసం అభిమానులు సిద్ధం అవుతున్నారు.