ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ తో పోలిస్తే మళ్లీ ఇప్పుడే గరిష్టంగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,050 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి పోలిస్తే 13 శాతం ఎక్కువగా కేసులు వచ్చాయి. గత ఏడాది సెప్టెంబర్ 16 తర్వాత ఇప్పుడే తొలిసారిగా కేసుల సంఖ్య 6 వేలను దాటింది. నిన్న ఒక్క రోజే 14 మంది మరణించారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా వల్ల 5,30,943 మరణించారు. మహరాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఒక్కొక్కరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశంలో పెరుగుతున్న కేసులకు XBB1.16 వేరియంట్ కారణం అవుతోంది. అయితే ఈ వేరియంట్ మరణించేంత ప్రభావం చూపించదు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం ఇండియాలో డైలీ పాజిటివీటీ రేటు 3.39 శాతంగా ఉంది. 28,303 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4.47 కోట్లు (4,47,45,104) కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.06 శాతంగా ఉంది. కోవిడ్ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.
ఇదిలా ఉంటే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేడు అత్యున్నత సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు, ఐసీయూలు, ఆక్సిజన్ సౌకర్యాలపై చర్చించనున్నారు.