దేశంలో పులుల సంఖ్యను ప్రకటించిన ప్రధాని.. ఎన్ని ఉన్నాయో తెలుసా..?

0
98

ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో 2022 వరకు ఉన్న పులుల సంఖ్యను ప్రకటించారు. దేశంలో 3,167 పులులు ఉన్నాయని వెల్లడించారు. ప్రాజెక్ట్ టైగర్ పెద్దపులుల పరిరక్షణలో ముందుందని అన్నారు. ప్రకృతిని రక్షించడం భారతీయ సంస్కృతిలో భాగంమని, ప్రాజెక్ట్ టైగర్ విజయం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి గర్వకారణమని ఆయన అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి, అదే సమయంలో ప్రపంచంలోని పులుల జనాభాలో 75% భారతదేశంలోనే ఉన్నాయని తెలిపారు.

ప్రపంచ భూభాగంలో కేవలం 2.4% మాత్రమే ఉన్న భారతదేశం, ప్రపంచ వైవిధ్యంలో 8 శాతానికి దోహదం చేస్తోందని అన్నారు. దశాబ్ధాల క్రితం భారత్ లో చిరుతలు అంతరించపోయాయని, అయితే మేము వాటిని నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి భారత్ తీసుకువచ్చామని అన్నారు. దాదాపుగా 30,000 ఏనుగులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆసియా ఏనుగులు సంఖ్యతో మనదేశం మొదటిస్థానంలో ఉందని ప్రధాని అన్నారు. ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50 సంవత్సరాల చాలా ముఖ్యమైన మైలురాయిని మనమందరం చూస్తున్నామని, భారతదేశం పులిని రక్షించడమే కాకుండా, అభివృద్ధి చెందడానికి అద్భుతమైన పర్యావరణ వ్యవస్థను కూడా ఇచ్చిందని కొనియాడారు.

కర్ణాటక చామనగర జిల్లాలో ఉన్న బందీపూర్ టైగర్ రిజర్వ్ లో ప్రధాని మోడీ ఈ రోజు పర్యటించారు. అటవిలో 20 కిలోమీటర్ల మేర సఫారీ చేశారు. బందీపూర్ టైగర్ రిజర్వ్ ను సందర్శించిన తొలి ప్రధానిగా రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో పాటు తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని సందర్శించి ఏనుగులకు ఆహారం అందించారు. ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్ల జ్ఞాపకార్థం అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్‌(ఐబీసీఏ)ని ప్రధాని మోడీ ప్రారంభించారు.

ఇటీవల ఆస్కార్ గెలుచుకున్న ‘ఎలిఫెంట్ విస్పర్స్’ డాక్యుమెంటరీ గురించి ప్రధాని ప్రస్తావించారు. ప్రకృతికి మరియు జీవులకు మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని మన వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. మన గిరిజన సమాజ జీవితం, సంప్రదాయం నుంచి ఏదైనా నేర్చుకోవాలని విదేశీ ప్రముఖులను కోరారు. ఎలిఫెంట్ విస్పరర్ జంట బొమ్మన్, వల్లిని కలిసి ప్రధాని మోదీ ముచ్చటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here