జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. తనకు తాను మైనింగ్ లీజును పొడగించడం ద్వారా ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ చేసిన అభ్యర్థనపై ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ కు పంపింది. ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని సీల్డ్ కవర్ లో పంపినట్లు జార్ఖండ్ రాజ్ భవన్ వర్గాలు వెల్లడించారు.
మైనింగ్ లీజుల్లో అక్రమాలకు సీఎం హేమంత్ సొరెన్ అక్రమాలకు పాల్పడినట్లు బీజేపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై గవర్నర్ ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరాడు. తాజాగా ఎన్నికల సంఘం హేమంత్ సొరెన్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈసీ నివేదిక ఆధారంగా గవర్నర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ కేసులో పిటిషనర్ అయిన బీజేపీ, ప్రజాప్రాతినిధ్య చట్టం , 1951లోని సెక్షన్ 9-ఏ ని ఉల్లఘించినందుకు, అక్రమంగా ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం ప్రయత్నించిన కారణంగా హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని కోరింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 192 ప్రకారం.. ఒక రాష్ట్ర శాసన సభ్యుడు ఏదైనా అనర్హతలకు లోబడి ఉన్నాడా..? లేడా..? అనే ప్రశ్న తలెత్తినప్పుడు గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం. అయితే ఇలాంటి కేసుల్లో గవర్నర్ ముందుగా సీఈసీ అభిప్రాయాన్ని తీసుకుంటారు. ప్రస్తుతం జార్ణండ్ అక్రమ మైనింగ్ వ్యవహారంపై సీబీఐ, ఈడీలు కూడా దృష్టి సారించాయి. జార్ఖండ్ లోని పలు చోట్ల దాడులు చేస్తోంది.