కాశ్మీర్ ప్రాంతం సినిమా షూటింగులకు ఫేమస్ కానీ.. అక్కడి ప్రజలు మాత్రం సినిమాకు దూరం అయ్యారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో దశాబ్ధాలుగా నెలకొని ఉన్న ఉగ్రవాదం కారణంగా అక్కడి థియేటర్లు అన్ని మూతపడ్డాయి. మళ్లీ ఎవరూ కూడా థియేటర్లను తెరవడానికి ప్రయత్నించలేదు. ఆర్టికల్ 370 రద్దు తరవాత జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు భద్రతా బలగాలు చెక్ పెడుతున్నాయి.
ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దక్షిణ కాశ్మీర్ లోని షోఫియాన్, పుల్వామా జిల్లాల్లో రెండు సినిమా హాళ్లను ఆదివారం ప్రారంభించారు. ఇది కాశ్మీర్ చరిత్రలోనే ‘చారిత్రాత్మక రోజని’ మనోజ్ సిన్హా పేర్కొన్నాడు. ఇక్కడి యువత చాలా ఎళ్లుగా దీని కోసం ఎదురుచూస్తోందని..ఆయన అన్నారు. ఈ ఏడాది చివరి నాటి శ్రీనగర్ లో మొదటి మల్టీప్లెక్సును ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాశ్మీర్ ప్రజలు, యువతకు వినోదాన్ని అందించడంతో పాటు వారిలోని నైపుణ్యాన్ని బయటకు తీసురావడానికి సహకరిస్తుందని ఆయన అన్నారు. బాలీవుడ్ మూవీ.. భాగ్ మిల్కా బాగ్ సినిమాకు హజరయ్యారు. మనోజ్ సిన్హాతో పాటు కాశ్మీర్ డివిజనల్ కమీషనర్ పాండురంగ్ కే పోల్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆప్ పోలీస్ విజయ్ కుమార్ సినిమాను వీక్షించారు.
జమ్మూ కాశ్మీర్ ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్.. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని సినిమాల షూటింగులకు, సినిమాల నిర్మాణానికి గమ్యస్థానంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. 1990 తర్వాత కాశ్మీర్ వ్యాప్తంగా తీవ్రవాదం పెరిగిపోవడంతో సినిమా హాళ్లు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే సినిమా థియేటర్లను ప్రారంభిస్తున్నారు. శ్రీనగర్ లో దశాబ్ధాల తరువాత బాదామి బాగ్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ మల్టీప్లెక్సు నిర్మాణం అవుతోంది. 1980 చివరి వరకు కాశ్మీర్ లోయలో 15 సినిమా హాళ్లు పనిచేశాయి. వాటిలో తొమ్మిది ఒక్క శ్రీనగర్ ప్రాంతంలోనే ఉండేవి.. అయితే యజమానులకు తీవ్రవాద గ్రూపుల నుంచి బెదిరింపులు రావడంతో వాటిని మూసేశారు. 1999లో శ్రీనగర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో రీగల్ సినిమాపై పున:ప్రారంభించిన రోజే గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. పదికిపైగా మంది గాయపడ్డారు. అనేక సినిమా హాళ్లు షాపింగ్ కాంప్లెక్సులుగా.. నర్సింగ్‌హోమ్‌లుగా మార్చబడ్డాయి. రానున్న రోజుల్లో అనంత్‌నాగ్, శ్రీనగర్, బందిపోరా, గందర్‌బల్, దోడా, రాజౌరి, పూంచ్, కిష్త్వార్, రియాసీలలో సినిమా హాళ్లు ప్రారంభం కానున్నాయి.