Kanpur Man Seeks 3 Days Leave To Bring Home Back His Wife: ఉన్నపళంగా సెలవు కావాలంటే.. ఉద్యోగులు ఏవేవో కారణాలు చెప్తారు. ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి ఇంట్లో ఎవరో చనిపోయారనే దాకా.. అబద్ధాలు చెప్పి సెలవు అడుగుతారు. కానీ.. ఒక వ్యక్తి మాత్రం అలాంటి అబద్ధాలు చెప్పకుండా, జరిగిన వాస్తవాన్ని చెప్పాడు. అలిగిన తన భార్య కోసం మూడు రోజుల లీవ్ కావాలంటూ లెటర్ రాశాడు. ప్రస్తుతమది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బేసిక్ శిక్షా అధికారిగా హమ్షాద్ అహ్మద్ పని చేస్తున్నాడు. ఇతను తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. అయితే.. ఇటీవల భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దాంతో అలిగిన భార్య, తన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఫోన్‌లో ఎన్నిసార్లు బ్రతిమిలాడినా వెనక్కు రాకపోవడంతో.. అత్తారింటికే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తనకు సెలవు కావాలని తన ఉన్నతాధికారికి లీవ్ లెటర్ రాశాడు.
‘‘సార్.. ఇటీవల నాకు, నా భార్యకి గొడవ జరిగింది. ఆ గొడవ వల్ల నా భార్య ముగ్గురు పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో నేను మానసికంగా కుంగిపోతున్నాను. నా భార్యను తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు ఊరికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి, నాకు మూడు రోజుల పాటు సెలవు మంజూరు చేయగలరని మనవి’’ అంటూ అహ్మద్ లేఖ రాశాడు. ఇప్పుడా లెటర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.