గర్ల్ ఫ్రెండ్ తో పెళ్లికి హత్యానేరంలో దోషికి పెరోల్.. కర్ణాటక హైకోర్టు సంచలన నిర్ణయం..

0
67

ఇటీవల అత్యాచార కేసులో నిందితుడైన యువకుడికి బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఓ కోర్టు. పోలీసులు, అధికారులు సమక్షంలో అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది. ఇదిలా ఉంటే మరోసారి ఇలాంటి కేసే తెరపైకి వచ్చింది. హత్యకేసులో పదేళ్ల శిక్ష అనుభవిస్తున్న నిందితుడు తన ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు కర్ణాటక హైకోర్టు 15 రోజుల పెరోల్ పై విడుదల చేసింది. తన కొడుకు ప్రేమించిన అమ్మాయికి వేరేవారితో పెళ్లి అవుతుందనే భయంతో కోర్టును ఆశ్రయించింది. అసాధారణ పరిస్థితిగా పరిగణించిన కర్ణాటక హైకోర్టు దోషికి పెరోల్ మంజూరు చేసింది.

అయితే ప్రభుత్వ న్యాయవాది.. పెళ్లి చేసుకోవడానికి పెరోల్ మంజూరు చేసే నిబంధన లేదని కోర్టులో వాదించారు. అయితే దోషి ఆనంద్ కు పెరోల్ ను మంజూరు చేసే అసాధారణ పరిస్థితిగా దీనిని జస్టిస్ ఎం నాగప్రసన్న పరిగణించి పెరోల్ ఇచ్చారు. ఆనంద్ తల్లి రత్నమ్మ, ప్రేమికురాలు నీతా పెరోల్ పిటిషన్ తో హైకోర్టును ఆశ్రయించారు. 30 ఏళ్ల నీతా తనకు మరొకరితో వివాహం జరుగుతోందని, అందువల్ల తనను పెళ్లి చేసుకోవడానికి ఆనంద్ కు పెరోల్ మంజూరు చేయాలని పిటిషన్ లో పేర్కొంది.

గత 9 ఏళ్లుగా ఆనంద్ తో ప్రేమలో ఉన్నట్లు పేర్కొంది. హత్య కేసులో ఆనంద్ కు జీవిత ఖైదు విధించబడింది. ఆ తరువాత దీన్ని 10 ఏళ్ల జైలు శిక్షగా తగ్గించారు. ప్రస్తుతం అతడు 6 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్నాడు. నిర్భంధంలో ఉన్న వ్యక్తి విడుదల తప్పనిసరి అని.. జైలులో ఉన్న అతను, తను ప్రియురాలు వేరే వివాహం చేసుకుంటే భరించలేడని, జీవితంలో ప్రేమను కోల్పోతాడని, అందువల్ల అతనికి పెరోల్ ఇస్తున్నట్లు కోర్టు తీర్పులో పేర్కొంది. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 20 సాయంత్రం వరకు దోషి ఆనంద్ ను పెరోల్ పై విడుదల చేయాలని జైళ్ల డిప్యూటీ ఐజీ, పరప్పర అగ్రహార జైల్ చీఫ్ సూపరింటెండెంట్ ను కోర్టు ఆదేశించింది. మళ్లీ జైలుకు తిరిగి వచ్చేందుకు, పెరోల్ వ్యవధిలో ఇతర నేరాలకు పాల్పడకుండా కఠిన షరతులు విధించాలని అధికారులను ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here