మణిపూర్‌లో ఘోరప్రమాదం.. 7గురు జవాన్లు మృతి, 45 మంది గల్లంతు

0
121

వర్షాల కారణంగా మణిపూర్‌లోని నోనీ పట్టణంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు జవాన్లు చనిపోగా.. మరో 45 మంది గల్లంతయ్యారు. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ నిర్మాణంలో ఉంది. దీని రక్షణ కోసం టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో 107 టెరిటోరియల్ ఆర్మీ బేస్‌ క్యాంప్‌ని ఏర్పాటు చేశారు. కాగా బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆ బేస్‌ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. అనేక మంది శిథిలాల కిందే చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు.

మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. ఇప్పటివరకు 19 మందిని రక్షించారు. ఆ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం స్థానిక అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మణిపూర్‌ సీఎం బిరేన్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ నేపథ్యంలో మణిపుర్ సీఎం బీరెన్ సింగ్​, రైల్వే మంత్రి అశ్వినీ వైశ్ణవ్ తో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. సహాయక చర్యల కోసం ఎన్​డీఆర్ఎఫ్ బృందం ఘటనాస్థలికి చేరుకుందని చెప్పిన ఆయన.. మరో రెండు బృందాలు సైతం వస్తున్నాయని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ తో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

కొండచరియలు విరిగిపడటం వల్ల ఐజెయ్ నది ప్రవాహం ఆగిపోయిందని నోనీ జిల్లా ఎస్డీవో సోలోమన్ ఫైమేట్ వెల్లడించారు. వరద నీరు రిజర్వాయర్​ లా మారిందన్నారు. నీటి ప్రభావానికి శిథిలాలు ఒక్కసారిగా పక్కకు జరిగిపోతే.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోతాయని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here