భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారించే అన్ని కేసుల విచారణను తన వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇటీవల సీజేఐగా పదవీ విరమణ చేసిన ఎన్వీ రమణ, పదవీ విరమణ రోజు సుప్రీంకోర్టు తన విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీంతో ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఇకపై రాజ్యాంగ ధర్మాసనం విచారించే ప్రముఖ కేసులన్నింటిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం..కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు 2018లో తీర్పును ఇచ్చింది. ఇది ప్రస్తుతం అమలులోకి వచ్చే ప్రక్రియ ప్రారంభం అయింది.
భారత ప్రధాన న్యాయమూర్తిగా యూయూ లలిత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. దేశంలో ప్రముఖ కేసులైన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దు వంటి కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. ఆగస్టు 26న అప్పటి సీజేఐ ఎన్వీ రమణ, పదవీ విరమణ రోజున కోర్టు విచారణలు లైవ్ స్ట్రీమింగ్ జరిగాయి. కొన్ని కేసులు ఏళ్ల తరబడి పెడింగ్ లో ఉండటంతో ఎన్వీ రమణ.. పలు కేసులపై రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేశారు.
గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనిచేశాయి. వర్చువల్ గా కేసుల విచారణ జరిగింది. కోర్టుల విచారణలో సాంకేతికతను విరివిగా ఉపయోగించారు. ఇది కూడా కోర్టు కేసులను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ఓ కారణంగా కనిపిస్తోంది. గతంలో కూడా పలువురు ప్రజా, రాజ్యాంగ ప్రాముఖ్యత ఉన్న కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని న్యాయమూర్తులకు లేఖలు రాశారు. సమాచార స్వేచ్ఛ కూడా ప్రతీ పౌరుడి ప్రాథమిక హక్కుల్లో ఒకభాగంగా ఉందని.. ఇటువంటి కేసుల్లో విచారణను ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇకపై రాజ్యాంగ ధర్మాసనం కేసుల్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.