దేవాలయాల్లో మొబైల్ ఫోన్లను బ్యాన్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధాన్ని విధించింది. దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించాలని మద్రాస్ హైకోర్టు మదురై బేంచ్ హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ శాఖను ఆదేశించింది.
తూత్తుకూడిలోని తిరుచెందూర్ లోని శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయానికి చెందిన తిరిసుతంతిరర్ అయిన పిటిషనర్ ఎం సీతారామన్ తిరుచెందూర్ ఆలయంలో భక్తులు ఆంక్షలు లేకుండా ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ తీస్తున్నందుకు, తిరుచెందూర్ ఆలయంలో సెల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. ఇది ఆగమ నియమాలకు విరుద్ధమని, ఆలయ భద్రతకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. మహిళా భక్తుల సమ్మతి లేకుండా ఫోటోలు తీసే అవకాశాలు ఉన్నాయని.. వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నాడు. మదురై మీనాక్షీ సుందరేశ్వర్ ఆలయంలో మతపరమైన పవిత్రతను, భద్రత కోసం సెల్ ఫోన్లపై నిషేధాన్ని విధించాని.. భక్తులు తమ ఫోన్లను పెట్టుకునేందుకు ఆలయం వెలుపల లాకర్లను ఏర్పాటు చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తులు ఆర్ మహదేవన్, జే సత్యనారాయణ ప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తుల భద్రతతో పాటు ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఆలయ ప్రాంగణం లోపల సెల్ ఫోన్లపై నిషేధాన్ని విధించేలా అధికారుల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫోన్లు, కెమెరాలు భక్తుల దృష్టిని మరల్చుతోందని అన్నారు.
మొబైల్ ఫోన్ల నిషేధం దేశవ్యాప్తంగా గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్ర స్వామి ఆలయంలో అమలు అవుతోందని.. తిరుచెందూర్ ఆలయ అధికారులు ఆలయ ఆవరణలో మొబైల్ ఫోన్ల నిషేధం, డ్రెస్ కోడ్ కోసం చర్యలు తీసుకోవాలని, తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో ఇదే విధంగా మొబైల్స్ పై నిషేధం విధించాలని సంబంధిత శాఖలను ఆదేశించింది.