Maharashtra Political Crisis: మహారాష్ట్రలో మలుపులు తిరుగుతున్న రాజకీయం

0
163

మహారాష్ట్రలో రాజకీయం పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతోంది అక్కడి మహా వికాస్ అఘాడీ రాజకీయాలు. తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వమైన ఎంవీఏ కూటమి ప్రస్తుతం చిక్కుల్లో పడిండి. శివసేనకు చెందిన దాదాపుగా 35 మంది నేతలు గౌహతిలో క్యాంపు పెట్టారు. శివసేన మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కూటమి ఏర్పడిందని.. బీజేపీతో శివసేన చేతులు కలపాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్కార్ మైనారిటీలో లేదని.. ఫ్లోర్ టెస్ట్ జరిగితే బలబలాలు తెలుస్తాయని.. సూరత్, అస్సాంలో కూర్చొని ఏదైనా మాట్లాడవచ్చని, తన కెరీర్లో ఇటువంటి ఎన్నో సంక్షోభాలను చూశానని, ఇక్కడికి వస్తే పరిస్థితి మారుతుందని ఆయన అన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకే మా మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు సూరత్ నుంచి అస్సాం ఎలా వెళ్లారో.. దీని వెనకాల ఎవరున్నారో తెలుసని.. పేర్లను తాను వెల్లడించనని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర పరిణామాలపై ఎన్సీపీ నేతలతో గురువారం సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా గురువారం రోజు ఏక్ నాథ్ షిండేను తన లీడర్ గా తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారు. బీజేపీ జాతీయ పార్టీ అని, మనం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకంగా అని బీజేపీ అన్నట్లుగా ఎమ్మెల్యేలతో చెప్పారు ఏక్ నాథ్ షిండే.

ఈ రాజకీయ సంక్షోభం వెనకాల బీజేపీ ఉందని ఇటు కాంగ్రెస్, అటు శివసేన ఆరోపిస్తున్నారు. ఈ రోజు శివసేన కీలక నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల అభీష్టం మహా వికాస్ అఘాడీ నుంచి వైదొలగడమే అయితే అందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యేలంతా ఒకసారి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here