ఇప్పుడు దేశవ్యాప్తంగా మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మెయిన్ హైలెట్ గా మారింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి బీటలు వారుతున్నాయి. శివసేన రెబెల్ మంత్రి ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో 35 మంది శివసేన ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు అస్సాం రాజధాని గౌహతిలోని బ్లూ రాడిసన్ స్టార్ హోటల్ లో క్యాంపు పెట్టారు. శివసేన, బీజేపీతో చేతులు కలపాలని.. శివసేన బాల్ ఠాక్రే సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్తుందని, కాంగ్రెస్, ఎన్సీపీలతో అనైతిక పొత్తుపెట్టుకుందని రెబెల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ అంశం మాత్రం అందర్ని ఆకర్షిస్తోంది. ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మక బ్లూ రాడిసన్ హోటల్లో క్యాంపు పెట్టడం, వీరందరి ఖర్చులు, వీరికి ఆతిథ్యం అన్నీ చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం దేశ రాజకీయాలకు గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ కేంద్ర బిందువుగా మారింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ నెలలో రాడిసన్ బ్లూ హెటల్ లో 42 మంది ఎమ్మెల్యేల కోసం 70 గదులను బుక్ చేశారని తెలుస్తోంది. ఏడు రోజుల కోసం ఈ గదులను బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు బుక్ చేవారనే విషయం స్పష్టంగా తెలియదు. ఏడు రోజుల పాటు అద్దెకు 70 రూములకు రూ. 56 లక్షలు ఖర్చవుతుందని తెలుస్తోంది. దీంతో పాటు తినే ఖర్చులు రూ. 8 లక్షలని, ఏడు రోజులకు కలిపి సుమారుగా రూ. 1.12 లక్షల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. దీనికి తోడు ఎమ్మెల్యేలను సూరత్ నుంచి గౌహతికి తరలించేందుకు చార్టర్డ్ విమానాలు, ఎయిర్ పోర్టు నుంచి బ్లూ రాడిసన్ హోటల్ వరకు విమనాల ఖర్చులు అదనం. ఇదంతా ఎవరు ఖర్చు పెడుతున్నారనేది మాత్రం ఇప్పటి వరకు రహస్యంగానే ఉంది.
ఇదిలా ఉంటే ఈ మొత్తం వ్యవహారానికి బీజేపీనే కారణం అని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాజాగా త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే బీజేపీనే ఇలా చేస్తోందని ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేకు న్యాయం జరగాలని ఆమె కోరుకున్నారు.