భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. తమిళనాడులో జరిగిన ఓ యువకుడి ఆత్మహత్య ఇప్పుడు అందరి మనస్సులను కలచివేస్తోంది.. కట్టుకున్న భార్య కన్నుమూయడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువకుడు.. ఓసారి ఆత్మహత్యకు యత్నించి.. ప్రాణాలతో బయటపడ్డాడు.. కానీ, ఆ తర్వాత మళ్లీ అదే ప్రయత్నం చేశాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు.. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడలూరు సమీపంలోని నిట్టమలై సెట్టి బస్‌స్టాప్‌లో గుణశేఖరన్ అనే యువకుడు నిన్న ఉదయం బస్సు టైర్ కింద తలపెట్టి ఆత్మహత్యాయత్నం చేశాడు.. అయితే.. డ్రైవర్ అప్రమత్తతో బతికి పోయాడు.. కానీ, సాయంత్రం అదే బస్ స్టాప్ లో మరో బస్సు టైర్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది..
అయితే, గుణశేఖరన్ ఆత్మహత్యకు కారణం అతడి భార్య లేకపోవడమే అని తెలుస్తోంది.. కొద్ది రోజుల క్రితం సముద్రంలో స్నానం చేస్తూండగా కొట్టుకుని పోయింది గుణశేఖరన్ భార్య భవానీ.. అయితే, ఆ ఘటన జరిగినప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.. వీరికి ఒక ఆడపిల్ల కూడా జన్మించింది. కనీసం.. ఆ చిన్నారి గురించి కూడా ఆలోచించలేని పరిస్థితికి వెళ్లిపోయాడు.. చివరకు ప్రాణాలు తీసుకున్నాడు.. మొదటిసారి మిస్ అయినా బిడ్డకోసం కూడా మనసు మార్చుకోకుండా.. రెండోసారి ప్రయత్నించి ప్రాణాలు తీసుకున్న వైనం స్థానికులను కలిచివేసింది. ఇక, గుణశేఖరన్ ఆత్మహత్యకు యత్నించింది.. మరియు ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి.