ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిని ప్రకటించిన మరుసటి రోజే ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరదించాయి. ఈ ఎన్నికల్లో తమ ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వాను బరిలో దించుతున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదివారం ప్రకటించారు. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బీజేపీ శనివారం ప్రకటించింది. తమ ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీలో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన భేటీలో నేతలు చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు. సమావేశంలో పాల్గొన్న 17 పార్టీల నేతలు ఏకగ్రీవంగా మార్గరెట్‌ను ఎంపిక చేసినట్లు శరద్ పవార్ వెల్లడించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో తామంతా ఐక్యంగానే ముందుకెళ్లనున్నట్లు శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ విపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, సీపీఎం నేత సీతారాం ఏచూరి, శివసేన నేత సంజయ్ రౌత్ టీఆర్‌ఎస్ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర రావులు పాల్గొన్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి నియామకం కోసం ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహించేందుకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం పట్ల మార్గరెట్ అల్వా ట్విటర్‌లో స్పందించారు. తనను ఎంపిక చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని.. విపక్షాల నిర్ణయాన్ని వినయంతో అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. తనపట్ల విశ్వాసం ఉంచిన విపక్షాల నేతలందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్టు ఆమె ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత అయిన మార్గరెట్ అల్వా గతంలో నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించారు. గోవాకు 17వ గవర్నర్‌గా, గుజరాత్‌కు 23వ గవర్నర్‌గా, రాజస్థాన్‌కు 20వ గవర్నర్‌గా, ఉత్తరాఖండ్‌కు నాలుగో గవర్నర్‌గా సేవలందించారు. అంతకుముందు ఆమె కేంద్రమంత్రిగానూ పనిచేశారు. 1942 ఏప్రిల్ 14న కర్ణాటకలోని మంగళూరులో జన్మంచిన మార్గరెట్ అల్వా.. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాలలో డిగ్రీ అభ్యసించారు. ఆ తర్వాత ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. కళాశాలలో చదువుతున్న సమయంలోనే ఆమె చర్చా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. ఆ క్రమంలోనే విద్యార్థి ఉద్యమాల్లోనూ పనిచేశారు. ఆ తర్వాత 1964 మే 24న నిరంజన్ థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1969లో రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావించిన ఆమె.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అనేక హోదాల్లో పనిచేశారు.