మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం దేశాన్ని ఆకర్షిస్తోంది. అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకుంది. శివసేనలో తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే 38 మంది శివసేన ఎంపీలతో గౌహతిలో క్యాంపు పెట్టారు. బీజేపీతో కలిసి అధికారం పంచుకునేందుకు సిద్ధం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే అనర్హత వేటు పడకుండా మొత్తం ఎమ్మెల్యేల్లో మూడింట రెండు వంతులు ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే గ్రూపులోనే ఉన్నారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. శివసేన కార్యకర్తలు రెబెల్ ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. ప్లెక్సీలు చింపుతూ..దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. శనివారం రోజు పూణేలోని కత్రాజ్ లోని బాలాజీ ప్రాంతంలో తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒకరైన తానాజీ సావంత్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే టార్గెట్ గా శివసైనికులు దాడులు చేస్తుండటంతో మహారాష్ట్రలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ స్పందించారు. ఉద్ధవ్ ఠాక్రేను ఉద్ధేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బాలాసాహెబ్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉద్ధవ్ ఠాక్రేను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేల కుటుంబాలకు రక్షణ కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఉద్ధవ్ ఠాక్రే గుండాయిజం అంతం కావాలని అన్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని రాష్ట్రపతిని అభ్యర్థించారు.
గతంలో హనుమాన్ చాలీసా వివాదంలో ఎంపీ నవనీత్ కౌర్ ఆమె భర్త రవిరాణాలకు, శివసేనకు మధ్య వివాదం చెలరేగింది. ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ దంపతులు సవాల్ విసరడంతో వివాదం చెలరేగింది. ఈ సమయంలో నవనీత్ కౌర్ కు దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఆ సమయంలో భగవాన్ హనుమాన్ శాపం ఉద్ధవ్ కు తగులుతుందని శాపనార్థాలు పెట్టింది నవనీత్ కౌర్.