పశ్బిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. 2021 ఎన్నికల తర్వాత బీజేపీ మంగళవారం ‘నబన్న అభియాన్’ పేరుతో పెద్ద ఎత్తున సెక్రటేరియట్ మార్చ్ కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు కోల్‌కతా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసులు ఎక్కడికక్కడ వీరిని అడ్డుకున్నారు. అనేక జిల్లాల్లో వేలాది మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేందు అధికారి, లాకెట్ ఛటర్జీ, తాప్షి మోండోల్, దిబాంకర్ ఘరామిలతో సహా చాలా మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత బీజేపీ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేయడం ఇదే మొదటిసారి. కోల్‌కతాలో నిరసన, ర్యాలీ చేపడుతున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వాటర్ క్యానన్స్, టియర్ గ్యాస్ ఉపయోగించి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. నిరసన కార్యక్రమాన్ని అణచివేసేందుకు లాఠీఛార్జ్ చేశారు. హల్దియా, నందిగ్రామ్ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. సెక్రరేటియట్ వెళ్లే అన్ని మార్గాలను మూసేశారు అధికారులు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. లేడీ కిమ్ లాగా వ్యవహరిస్తున్నారని.. బెంగాల్ రాష్ట్రంలో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేత సువేందు అధికారి విమర్శించారు. ఉత్తర్ కొరియాలాగే.. బెంగాల్ రాష్ట్రాన్ని మమతా బెనర్జీ పాలిస్తున్నారంటూ విమర్శంచారు. సీఎం మమతా బెనర్జీకి ప్రజల మద్దతు లేదని.. నిన్నటి నుంచి పోలీసులు చేస్తున్న దాడికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాలల్ లోని పలు జిల్లాల నుంచి బీజేపీ కార్యకర్తలు రైళ్లలో రాజధాని కోల్‌కతాకు చేరుకుంటున్నారు. ప్రజా తిరుగుబాటుకు టీఎంసీ ప్రభుత్వం భయపడుతోందని.. వారు మా ప్రదర్శనను ఆపడానికి ప్రయత్నించినా.. మేము శాంతియుతంగానే ప్రతిఘటిస్తామని.. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.