నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని నేడు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనుంది. జూలై 26న మరోసారి ఆమె ఈడీ ముందు హాజరుకావాలని ఇప్పటికే సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ అధికారులు సోనియాగాంధీ స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు. ఈ నెల 21న ఇప్పటికే సోనియాగాంధీని ఈడీ ఒక సారి విచారించింది. దాదాపుగా మూడున్నర గంటల పాటు ఈడీ ఆమెను మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించింది. దాదాపుగా 28 ప్రశ్నలను ఈడీ, సోనియాగాంధీని అడిగింది. ఈ రోజు జరిగే విచారణకు సోనియా గాంధీతో పాటు ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు కూడా ఈడీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ నేతలు మరోసారి ఆందోళనలకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 21న సోనియా గాంధీని విచారిస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. దీంతో దాదాపు 75 మంది ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ వంటి వారు ఆందోళనల్లో పాల్గొన్నారు. తాజాగా ఈ రోజు కూడా కాంగ్రెస్ నేతలు శాంతియుతంగా నిరసన తెలపాలని అనుకుంటున్నారు. ఢిల్లీ పోలీసులు ఈడీ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ దళాలను ఈడీ కార్యాలయానికి ఒక కిలోమీటర్ ముందున మోహరించనున్నారు.
ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే, పవన్ బస్సన్ లను ఈడీ విచారించింది. జూలై 13 నుంచి వరసగా కొన్ని రోజులు ఈడీ, రాహుల్ గాంధీని ప్రశ్నించింది. ఏకంగా 40 గంటల పాటు ఈ కేసులో ఆయన విచారణ ఎదుర్కొన్నారు. అయితే అదే సమయంలో సోనియాగాంధీ విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసినా.. ఆమెకు కోవిడ్ సోకడంతో విచారణ వాయిదా పడింది. తాజాగా ఆమె విచారణ ఎదుర్కొటున్నారు.