ఆవశ్యక ఔషధాల జాబితాలో కొత్తగా 34 ఔషధాలు.. అందుబాటు ధరలో క్యాన్సర్ మందులు

0
131

జాతీయ ఆవశ్యక ఔషధాల జాబితాను రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ జాబితాలో కొత్తగా 34 రకాల మందులను చేర్చడంతో పాటు 26 మందులను తొలిగించారు. మొత్తంగా జాతీయ ఆవశ్యక ఔషధాల జాబితాలో ఔషధాల సంఖ్య 384కు చేరుకుంది. అనేక యాంటీబయాటిక్స్ తో పాటు కాన్సర్ నిరోధక మందులను ఈ జాబితాలో చేర్చారు. దీని వల్ల వీటి ధలరు మరింతగా దిగివచ్చే అవకాశం ఉంది.

అయితే ఇండియాలో గ్యాస్ట్రిక్ సమస్యలకు వాడుతున్న రానిటిడిన్, జిన్ టాక్, రాన్ టాక్ వంటి మందులను ఈ జాబితా నుంచి తొలగించింది. వీటి వల్ల కాన్సర్ కారణం అయ్యే ఎన్- నైట్రోసోడిమిథైలమిన్(ఎన్డీఎంఏ) ఉండటంతో వీటిని నిషేధించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు సుక్రాల్ఫేట్, వైట్ పెట్రోలేటమ్, అటెనోలోల్, మిథైల్డోపా వంటి 26 మెడిసిన్స్ ను తొలగించారు.

జాబితాను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్వీట్ చేస్తూ.. ‘‘ నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ 2022 జాబితాలో 27 కేటగిరీలతో 384 మందులు ఉన్నాయి. అనేక యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్లు, యాంటీ క్యాన్సర్ మందులు ఉన్నాయి. ఇవన్నీ తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి. రోగులకు ఖర్చు తగ్గుతుంది’’ అని అన్నారు.

ఎండోక్రైన్ మందులు, గర్భనిరోధకాలు ప్లూడ్రోకార్టిసోన్, ఓర్మెలోక్సిఫెన్, ఇన్సులిన్ గ్లార్జిన్, టెనెలిగ్లిప్టిన్ వంటి వాటిని జాబితాలోకి తీసుకున్నారు. ఊపిరితిత్తుల వ్యవస్థపై పనిచేసే మాంటెలుకాస్ట్, కంటి చికిత్సలో ఉపయోగించే లాటానోప్రోస్ట్ తో పాటు గుండె సంబంధిత ఔషధాలు డబిగాట్రాన్, టెనెక్టెప్లేస్ వంటి వాటిని, పాలియోటివ్ కేర్ లో ఉపయోగించే మందులను కొత్తగా జాబితాలోకి చేర్చారు. ఐవర్ మెక్టిన్, మెరోపెనెమ్, సెఫురోక్సిమ్, అమికాసిన్, బెడాక్విలిన్, డెలామానిడ్, ఇట్రాకోనజోల్ ఎబిసి డొలుటెగ్రావిర్ వంటి యాంటిఫెక్టివ్ మందులను అవసర జాబితాలోకి చేర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here