రాజస్థాన్ ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ అనే వ్యక్తిని ఇద్దరు తల నరికివేసి హత్య చేయడం దేశంలో కలకలం రేపింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలపిన కారణంగా ఇద్దరు మతోన్మాదులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్ చేశారు. ఉదయ్ పూర్ లో 144 సెక్షన్, కర్ఫ్యూ విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. తాజాగా శాంతి భద్రతల గురించి సీఎం అశోక్ గెహ్లాట్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఇదిలా ఉంటే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ హత్యతో ఏదైనా సంస్థకు ప్రయేమం ఉందా.. అంతర్జాతీయ లింకులు ఉన్నాయా..? ఉగ్రవాద చర్యా..? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికే రాజస్థాన ప్రభుత్వం అక్కడి ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. ఇరువర్గాలు సంయమనం పాటించాలని పోలీసులు కోరుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ పాశవిక ఘటనలను ముస్లిం సంస్థలతో పాటు అందరూ ఖండిస్తున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ హత్యను తీవ్రంగా ఖండించింది. చట్టాన్ని చేతులోకి తీసుకోవడాన్ని, ఒకర్ని హత్య చేయడాన్ని ఇస్లాంకు విరుద్ధమని పేర్కొంది. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, కేరళ గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ ఖండించారు. బీజేపీ పార్టీ నేతలు ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ మెతక వైఖరే కారణం అని విమర్శిస్తోంది.