విపక్షాల ఐక్యతే లక్ష్యం.. సోనియాతో నితీష్ కుమార్, లాలూ భేటీ

0
118

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఏకం కావడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్, కేసీఆర్ వంటి నేతలు. బీహార్ లో జేడీయూ-ఆర్జేడీ మహాకూటమిలాగే కేంద్రంలో మహాకూటమి ఏర్పాటు చేసే దిశలో ఉన్నారు నితీష్ కుమార్. ఇటీవల బీహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్.. సెప్టెంబర్ మొదటివారంలో మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎన్సీపీ నేత శరద్ పవార్, వామపక్షాల నేతలను కలుసుకున్నారు.

తాజాగా ఈ రోజు (ఆదివారం) రోజు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ కానున్నారు. దాదాపుగా ఐదేళ్ల తరువాత ఈ మూడు పార్టీల నాయకులు ఒకే వేదికపై కలుసుకుంటున్నారు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్డీ) వ్యవస్థాపకుడు దివంగత చౌదరి దేవీలాల్ జయంతి సందర్భంగా నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీ వెళ్లారు. నితీష్ కుమార్ తో కలిసి సోనియాగాంధీని కలుస్తానని మంగళవారం లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు.

2024 ఎన్నికలే టార్గెట్ గా మహాకూటమి ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతిపక్షాలు ఉన్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసే పనిలో ఉన్నారు బీహార్ నేతలు. 2024 ఎన్నికల్లో బీజేపీని కూకటివేళ్లతో పెకిలించాలని లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు. మరోవైపు దక్షిణాది నుంచి కేసీఆర్ కూడా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని భావిస్తున్నారు. ఇటీవల బీహర్ వెళ్లిన సీఎం కేసీఆర్.. ఈ విషయంపై నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లతో చర్చించారు. మరోవైపు సీఎం నితీష్ కుమార్ వచ్చే ఎన్నికల్లో పీఎం అభ్యర్థి అని ఆయన పార్టీ జేడీయూ కార్యకర్తలు బీహార్ వ్యాప్తంగా పోస్టర్లతో హోరెత్తిస్తున్నారు. తాజాగా ముగ్గురు నేతల మధ్య జరిగే సమావేశంపై దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here