బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్

0
132

సీఎం నితీష్‌కుమార్ రాజీనామాతో బిహార్‌ నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ముగింపు లభించినట్లు అయింది. నితీష్​ కుమార్​ ఎత్తుగడతో బిహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయినట్లు అయింది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్‌ ఆర్జేడీ-లెఫ్ట్‌-కాంగ్రెస్‌ సారథ్యంలోని మహాఘటబంధన్‌తో చేతులు కలిపారు. దీంతో బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఖరారు అయింది. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు బిహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్‌ 8వ సారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. భాజపాతో తెగదెంపులు చేసుకున్నామని.. ఆర్జేడీ సారథ్యంలో ఏడు పార్టీలతో కూడిన మహాఘటబంధన్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఇప్పటికే నితీశ్‌ గవర్నర్‌ను కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఒక్కరోజే నితీష్ వరుసగా రెండుసార్లు గవర్నర్‌ ఫాగు చౌహాన్‌తో భేటీ అయ్యారు. తొలిసారి భేటీలో భాజపాతో తెగదెంపులు చేసుకున్న విషయాన్ని గవర్నర్‌కు చెప్పి రాజీనామా లేఖను అందజేసిన నితీష్.. రెండోసారి భేటీలో ఆర్జేడీ సారథ్యంలోని మహాఘటబంధన్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు.

బీజేపీతో పొత్తును తెంచుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత బీహార్‌లో ఏడు పార్టీల మద్దతుతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనతాదళ్-యునైటెడ్ నాయకుడు నితీష్ కుమార్ మంగళవారం తెలిపారు. ఆర్జేడీ సహా ఏడు పార్టీలు తనకు మద్దతిస్తున్నాయని చెప్పారు. మహాఘటబంధన్‌లో స్వతంత్రులతో పాటు 164 మంది ఎమ్మెల్యేలు సహా 7 పార్టీలు ఉన్నాయని ఆయన మీడియాతో వెల్లడించారు. ఆ సమయంలో ఆయన వెంట ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు. 243 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో జేడీయూ, ఆర్జేడీ కలిసి మెజారిటీని కలిగి ఉన్నాయి. జేడీయూకి 45, ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి జితన్ మాంఝీకి చెందిన హెచ్‌ఏఎం వంటి చిన్న పార్టీల మద్దతు కూడా ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.నితీష్ కుమార్ రాజీనామాకు ముందు హైవోల్టేజ్ రాజకీయాలకు బిహార్ వేదికైంది. ప్రధాన పార్టీలన్నీ విడివిడిగా తమ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించాయి.

బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ఆ పార్టీలను నాశనం చేస్తుందనే విషయాన్ని చరిత్రే చెబుతోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. పంజాబ్‌, మహారాష్ట్రలలో జరిగిందేమిటో మనం చూశామని చెప్పారు. భాగస్వామ్య పార్టీలను చీల్చి భాజపా పగ్గాలు చేపట్టాలనుకుందని ఆక్షేపించారు. బిహార్‌లోనూ జేడీయూని చీల్చి భాజపా సొంతంగా పాలించాలనుకుందన్నారు. సీఎం నితీష్‌ కుమార్‌ త్వరగా మేల్కొని బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చారని చెప్పారు. బిహార్‌లో బీజేపీ అజెండా అమలు కాకూడదనే తామంతా కోరుకుంటున్నట్టు చెప్పారు. నితీష్ కుమార్‌ నాయకత్వంలో బిహార్‌ అభివృద్ధి చెందుతోందని మాజీ సీఎం, హిందుస్థానీ అవామీ మోర్చా చీఫ్‌ జితిన్‌ రామ్‌ మాంఝీ కొనియాడారు. బిహార్‌ అభివృద్ధికి రూపశిల్పిగా ఆయన్ను అభివర్ణించారు. ఆ విశ్వాసంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయనతో కలిసి పనిచేయాలని శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారన్నారు.

ఇంకోవైపు ఎన్డీయే కూటమి నుంచి నితీష్‌ కుమార్‌ బంధం తెంచుకోవడం పట్ల బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నితీష్ బీజేపీని, బిహార్‌ ప్రజలను మోసం చేశారంటూ దుయ్యబడుతున్నారు. 2020 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కింద తాము పోటీ చేసి విజయం సాధించామన్నారు. తమకు సంఖ్యా బలం ఎక్కువగా ఉన్నప్పటికీ.. నితీష్‌ను సీఎంగా ఎన్నుకున్నామన్నారు. కానీ, ఈ రోజు ఆయన బీజేపీని, బిహార్‌ ప్రజలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. దీన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటీకీ సహించబోరని బిహార్‌ బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ జైశ్వాల్‌ ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here