పేరు లేని రైల్వే స్టేషన్ ఎక్కడైనా ఉంటుందా? కానీ, మన దేశంలో అలాంటి ఒక స్టేషన్ ఉంది. బెంగాల్‌లోని బర్ధమాన్ నగరానికి కొంత దూరంలో ఈ స్టేషన్ ఉంది. అక్కడ రైలు ఆగుతుంది కానీ, ఆ స్టేషన్‌కి మాత్రం పేరు లేదు. ఇందుకు ఒక ప్రధాన కారణం.. రెండు గ్రామాల మధ్య చిచ్చే! తూర్పు బర్ధమాన్ జిల్లాలో రైనా, రైనాగర్ అనే రెండు గ్రామాలున్నాయి.
ఈ రెండు గ్రామాల మధ్య 2008లో ఒక రైల్వే స్టేషన్ నిర్మించారు. దీనికి రైనాగర్ అనే పేరు పెట్టారు. ఈ పేరే ఆ రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. ఆ రైల్వే స్టేషన్‌కు ‘రైనా’ పేరు ఎందుకు పెట్టలేదని ఆ గ్రామం ప్రజలు ఆందోళనకు దిగారు. ఆ గ్రామ ప్రజలు ఇలా ఆందోళనకు దిగడానికి ఓ కారణం కూడా ఉంది. అదేమిటంటే.. ఈ స్టేషన్ రైనా గ్రామానికి చేరువలో ఉంటుంది. పైగా.. స్టేషన్ కూడా ఆ గ్రామంలోనే ఉంది. అలాంటప్పుడు తమ గ్రామం పేరు కాకుండా ‘రైనాగర్’ పేరు ఎలా పెడతారంటూ వాళ్లు అధికారుల్ని నిలదీస్తున్నారు.
ఇదే సమయంలో.. ఆల్రెడీ పెట్టిన పేరును తొలగించడానికి వీలు లేదంటూ రైనాగర్ గ్రామ ప్రజలు పట్టుపట్టారు. ఇలా రెండు గ్రామాల మధ్య ఘర్షణ పెరిగి పెద్దదైంది. వ్యవహారం రైల్వే శాఖ దాకా వెళ్లింది. దీంతో.. గ్రామాల మధ్య గొడవని అదుపు చేసేందుకు స్టేషన్ పేరుని తొలగించింది. అంతే, అప్పటి నుంచి ఆ స్టేషన్ పేరు లేని స్టేషన్‌గా నిలిచిపోయింది. ఇంతవరకూ ఈ సమస్య పరిష్కారం కాలేదు. అయితే.. రైల్వే ఇస్తోన్న టికెట్‌పై మాత్రం రైనాగర్ అనే పేరు ఉంటోంది.