పాకిస్తాన్ తో చర్చలు ఉండవు.. ఉగ్రవాదాన్ని అంతమొందిస్తాం: అమిత్ షా

0
53

జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాకిస్తాన్ పై, జమ్మూ కాశ్మీర్లో గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తో ఎలాంటి చర్చలు ఉండవని.. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్లటి.. దేశంలో అత్యంత ప్రశాంత ప్రదేశాంగా మారుస్తుందని నొక్కి చెప్పారు. బారముల్లాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో 1990 నుంచి 42,000 మంది ప్రాణాలను ఉగ్రవాదం బలితీసుకుందని.. దీని వల్ల ఎవరికైనా ప్రయోజనం చేకూరిందా..? అని ప్రశ్నించారు.

1947 దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ లో ఎక్కువగా పాలించిన అబ్దుల్లా( నేషనల్ కాన్ఫరెన్స్), ముఫ్తీలు( పీడీపీ), నెహ్రూ-గాంధీ( కాంగ్రెస్) కుటుంబాలు కాశ్మీర్ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. పాకిస్తాన్ తో మాట్లాడాలని కొందరు అంటున్నారని.. పాకిస్తాన్ తో ఎందుకు మాట్లాడాలని..? అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సహించదని.. దాన్ని తుడిచిపెడుతామని అన్నారు. మోదీజీ పాలన కాశ్మీర్ లో ఉపాధి, అభివృద్థిని తీసుకువస్తుందని అన్నారు. గుప్కార్ మోడల్ యువత చేతిలో రాళ్లు, తుపాకులను అందిస్తోందని ఆరోపించారు. మోదీ మోడల్, గుప్కార్ మోడల్ మధ్య చాలా వ్యత్యాసం ఉందని అన్నారు.

కొందరు పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారని.. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ఎన్ని గ్రామాలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు. గత మూడేళ్లలో కాశ్మీర్ లోని అన్ని గ్రామాలకు విద్యుత్ కనెక్షన్లు అందించామని ఆయన అన్నారు. ముఫ్తీలు, అబ్దుల్లాలు, కాంగ్రెస్ పార్టీలు కాశ్మీర్ కోసం చేసిందేం లేదని అన్నారు. 1947లో గిరిజన ఆక్రమణదారులతో పోరాడిన కాశ్మీర్ పుత్రుడు మక్బూల్ షేర్వానీకి నివాళులు అర్పించారు అమిత్ షా. అమిత్ షా ప్రసంగం మధ్యలో స్థానిక మసీదు నుంచి నమాజ్ వస్తుండటంతో తన ప్రసంగాన్ని ఆపేసి, నమాజ్ అయిన తర్వాత ప్రసంగం ప్రారంభించారు.

ప్రధాని మోదీ, కాశ్మీర్ లో ప్రజాస్వామ్యాన్ని పంచాయతీ, బ్లాక్ లెవల్ వరకు తీసుకెళ్లారని.. ప్రస్తుతం 30 వేలకు మందికిపైగా ప్రజా ప్రతినిధులు ఉన్నారని ఆయన అన్నారు. 1947 నుంచి 70 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ కు కేవలం 15,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2019 నుంచి ఇప్పటి వరకు కాశ్మీర్ రూ.56,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన అన్నారు. మీరు కాశ్మీర్ ను ఉగ్రవాద ప్రదేశంగా మారిస్తే.. ప్రధాని మోదీ దీన్ని పర్యటాక ప్రదేశంగా మార్చారని అన్నారు. గత అక్టోబర్ వరకు కాశ్మీర్ కు 22 లక్షల మంది పర్యాటకులు వచ్చారని ఆయన అన్నారు. 2014 వరకు కాశ్మీర్ లో నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు అవి తొమ్మిది అయ్యాయని అన్నారు. ఆర్టికల్ 370 ఉన్నంత వరకు గుజ్జర్లు, బకర్వాల్లు, పహారీలు రిజర్వేషన్లు పొందలేదని.. ఇప్పడు వారంతా రిజర్వేషన్లు పొందుతారని అమిత్ షా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here