కేరళలో మంకీపాక్స్‌తో ఓ వ్యక్తి మృతి.. దేశంలో తొలి మరణం

0
115

దేశంలో మంకీపాక్స్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కేరళలో మంకీపాక్స్‌ మరణం కలకలం రేపుతోంది. దీనితో భారతదేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదైనట్లైంది. కేరళలోని త్రిసూర్ జిల్లా పున్నియార్‌లో 22 ఏళ్ల యువకుడు వైరస్‌తో చనిపోయాడు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. మృతి చెందిన యువకుడు యూఏఈ నుంచి జులై 21న భారత్‌కు వచ్చాడు. అనంతరం జ్వరం, తలనొప్పితో ఎక్కువ కావడంతో జులై 27న ఆస్పత్రిలో చేరాడు. అతని శరీరంపై మంకీపాక్స్‌ లక్షణాలు లేకపోవడంతో ఆ దిశగా చికిత్స అందించలేదు. అయితే, శనివారం ఆ యువకుడు మృతి చెందాడు. అనంతరం అతడికి యూఏఈలో జులై 19నే మంకీపాక్స్‌ సోకిన విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులు అధికారులకు వెల్లడించారు. యూఏఈ నుంచి భారత్‌కు బయలుదేరే ముందు వచ్చిన మంకీపాక్స్‌ పరీక్ష ఫలితాన్ని వైద్యులకు అందించారు. దానిని మరోసారి నిర్ధారించుకునేందుకు కేరళ ఆరోగ్యశాఖ అధికారులు మృతుడి నమూనాలను స్థానిక వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు

ఇక్కడికి రావడానికి ఒక్కరోజు ముందే పరీక్షలు నిర్వహించగా.. అక్కడే మంకీపాక్స్ నిర్ధారణ అయ్యిందని మంత్రి చెప్పారు. దీంతో అతడి నమూనాలను మరోసారి పరీక్షకు పంపించిన కేరళ ఆరోగ్యశాఖ అధికారులు.. అతడి మృతికిగల కారణాలను విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు. మంకీపాక్స్ కేసుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆమె వివరించారు. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. దీన్ని దేశంలో తొలి మంకీపాక్స్‌ మరణంగా భావిస్తున్నారు. కాగా ఈ మరణానికి సంబంధించిన రిపోర్టును అలప్పూజలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆదివారం రాత్రి లేదా సోమవారం విడుదల చేసే అవకాశాలున్నాయి. యువకుడి మృతదేహాన్ని మంకీపాక్స్‌ ప్రొటోకాల్‌కు అనుగుణంగానే ఖననం చేసిన అధికారులు.. అతడి ప్రైమరీ కాంటాక్టులను పర్యవేక్షణలో ఉంచారు. ఇదే విషయంపై మాట్లాడిన కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌.. యువకుడిలో మంకీపాక్స్‌ లక్షణాలేవీ కనిపించలేదన్నారు. దీంతోపాటు అతడికి మంకీపాక్స్‌ పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని యూఏఈ అధికారులు తెలియజేయకపోవడంపై ఉన్నతస్థాయి విచారణ జరుపుతామని వీణా జార్జ్‌ అన్నారు. మనదేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వాటిలో మూడు కేసులు కేరళలో వెలుగు చూశాయి. ఢిల్లీలో మరో కేసు వెలుగు చూసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here