కేంద్ర సంస్థల దుర్వినియోగంపై 9 మంది ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. తమ నేతలను ఇరికించేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినయోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు లేఖలో ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇరికించడాన్ని ఆప్ నేతలు ఉదహరించారు. ఇలాగే మరికొన్ని ఉదాహరణలను లేఖలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)లను నేతలను ఇరికించేందుకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
లేఖలో సంతకాలు చేసిన నేతల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత చంద్రశేఖర్ రావు, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్‌సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్, శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ ఉన్నారు. 2014 నుంచి బీజేపీ హయాంతో కేసులు నమోదు చేసినవారిలో ఎక్కువ మంది ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నాయకులే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.
బీజేపీలో చేరిన ప్రతిపక్షాల నేతలపై కేసుల దర్యాప్తు నెమ్మదిగా సాగుతోందని పలు ఉదాహరణలను పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుత అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై 2014, 2015లో శారద చిట్ ఫండ్ స్కామ్ లో సీబీఐ, ఈడీలు విచారణ జరిపాయని, అయితే బీజేపీలో చేరిన తర్వాత కేసులో పురోగతి లేదని, ఇదే విధంగా నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో మాజీ టీఎంసీ నేత, ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారి, ముకుల్ రాయ్ లపై ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయని.. అయితే ప్రస్తుతం ఈ కేసుల్లో కదలిక లేదని లేఖలో పేర్కొన్నారు.