పెళ్లయిన అమ్మాయిల పరిస్థితి ఏం కావాలి.. అస్సాం ప్రభుత్వంపై ఓవైసీ ఆగ్రహం

0
425

అస్సాం ప్రభుత్వం బాల్యవివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బాల్య వివాహాలకు పాల్పడిన వారిని వరసగా అరెస్ట్ చేస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బాల్యవివాహాల అణిచివేతపై అస్సాం రాష్ట్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ అయిన వారి భార్యలను ఎవరు చూసుకుంటారని ప్రశ్నించారు. హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం ఎగువ అస్సాంలోని ప్రజలకు భూములు ఇచ్చిందని, దిగువ అస్సాంలో ఇలా చేయడం లేదని ఆరోపించారు. కేవలం అస్సాంలోనే ఇప్పుడే ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని.. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

హిమంత బిస్వా నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్ని పాఠశాలలు స్థాపించిందని ఒవైసీ ప్రశ్నించారు, బీజేపీ ప్రభుత్వం కొత్త పాఠశాలలను ఎందుకు తెరవడం లేదని అడిగారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రాష్ట్రంలో బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపారు. ఇప్పటి వరకు 2,000 మందిని అరెస్ట్ చేశారు. 4004 కేసులు నమోదు చేశారు. 8000 మంది నిందితులు జాబితా తమ వద్ద ఉందని, ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే తమ భర్తలు, కుమారులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ, తమకు ఆదాయమార్గాలు లేవని పెద్ద సంఖ్యలో మహిళలు నిరసన చేపట్టారు. తమ భర్తలు, కొడుకులను అరెస్ట్ చేస్తే తాము, తమ పిల్లలు ఎలా బతుకుతారని మహిళలు ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here