దావూద్ ఇబ్రహీం అప్పగింతపై పాక్ అధికారుల మౌనం

0
61

అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంతో పాటు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ అప్పగింతపై పాకిస్తాన్ అధికారులు సమాధానం దాటవేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ కార్యక్రమానికి పాకిస్తాన్ తమ దేశం తరుపున ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహసీన్ భట్ ను పంపింది. ఇద్దరు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.

పాకిస్తాన్ కరాచీలో దావూద్ ఇబ్రహీం, లాహోర్ ప్రాంతంలో హఫీస్ సయీద్ ఉంటున్నారు. ఇది అందరికి తెలిసిన రహస్యమే. అయితే పాకిస్తాన్ మాత్రం తమ దేశంలో దావూద్ లేడని బుకాయిస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశం తరువాత వీరిద్దరిని భారత్ కు అప్పగిస్తారా..? అని భారత మీడియా ప్రశ్నించింది. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు మొహసీన్ భట్. సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.

పాకిస్తాన్, ఇండియా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న ఈ సమయంలో పాకిస్తాన్ అధికారులు భారత్ లో జరుగుతున్న ఈ సమావేశానికి రావడం విశేషం. ఇటీవల కాలంలో పలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్, కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించింది. భారత్ అంతే ధీటుగా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను కట్టడి చేయాలని డిమాండ్ చేసింది. పరిస్థితులు ఇలా ఉన్నా కూడా పాకిస్తాన్ తన ప్రతినిధులను భారత్ పంపింది.

ఇంటర్ పోల్ అత్యున్నత పాలకమండలి దాని పనితీరుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రతీ ఏడాది ఒక సారి సమావేశం అవుతుంది. ఈ ఏడాది న్యూ ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ సమావేశంలో ప్రసంగించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు శుక్రవారంతో ముగుస్తాయి. 195 ఇంటర్ పోల్ సభ్యదేశాల నుంచి మంత్రులు, పోలీస్ చీఫ్ లు, ఆయా దేశాల సెక్యూరిటీ ఏజెన్సీ అధిపతులు, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొంటారు. 25 ఏళ్ల విరామం తరువాత 2022లో ఈ సమావేశానికి భారత్ అతిథ్యం ఇచ్చింది. చివరి సారిగా 1997లో ఇండియాలో ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here