బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్థ ఛటర్జీ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈడీ విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన తన కుక్కల కోసమే ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నట్లు ఈడీ విచారణలో తేలింది. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసులో ఆయనను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిన విషయమే. విచారణలో ఆయనకు సంబంధించిన అక్రమాస్తులు బయటపడుతున్నాయి. కోల్‌కతా సిటీలో పార్థ ఛటర్జీకి మూడు ఖరీదైన ఫ్లాట్‌లు ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. అందులో ఒకటి తన కుక్కలకే కేటాయించినట్లు తెలుస్తోంది. మంత్రి పార్థ చటర్జీకి జంతుప్రేమికుడని గుర్తింపు ఉన్న ఆయన.. అందుకే కుక్కల కోసం పూర్తిగా ఎయిర్ కండీషనింగ్ కలిగిన ఫ్లాట్‌ను కేటాయించినట్లు అధికారులు భావిస్తున్నారు. పార్థ చటర్జీని ఈడీ అధికారులు శనివారం ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు మంత్రి సన్నిహితురాలు అర్పిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో అర్పిత ముఖర్జీ నివాసంలో రూ.21కోట్ల నగదు, రూ.కోటి కోటి విలువ చేసే బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్పితకు పార్థ చటర్జీ మూడు ఫ్లాట్స్‌ను కానుకగా ఇచ్చారని, వాటిలో ఒక నివాసంలోనే డబ్బు, బంగారం సీజ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతేకాదు వీరిద్దరి పేరు మీద బోల్పుర్‌లోని శాంతినికేతన్‌లో ఓ అపార్ట్‌మెంట్ కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆ ఫ్లాట్లపై కూడా విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే కుటుంబ సభ్యులకు గానీ, సంబంధీకులకు గానీ అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఎవరికి ఫోన్ చేయాలని ఈడీ అధికారులు అడగడంతో ఆయన సీఎం మమతకు అని సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన అర్ధరాత్రి 2.31 గంలకు, 2.33 గంటలకు, 3.37 గంటలకు, ఉదయం 9.35 గంటలకు దీదీకి ఫోన్ చేశారు. అయినప్పటికీ ఆ కాల్‌కు ఆమె సమాధానం ఇవ్వలేదు. అయినా చటర్జీ మరో మూడుసార్లు దీదీకి ఫోన్ చేసినప్పటికీ ఆమె లిఫ్ట్ చేయలేదు. మరో నాలుగుసార్లు ప్రయత్నించినప్పటికీ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అనే సమాధానం రావడంతో.. చేసేదేమిలేక ఆయన ఈడీ అధికారుల వెంట నడిచారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఈ విషయాన్ని ఖండించింది. మమతకు ఎలాంటి కాల్స్ రాలేదని పేర్కొంది.