ఆర్ఎస్ఎస్ నాయకులే లక్ష్యంగా పీఎఫ్ఐ కుట్ర

0
71

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) గురించి నెమ్మనెమ్మదిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంతో పాటు ముస్లిం దేశాల నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయడం, ముస్లిం యువతను అల్ ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపించడం వంటి అభియోగాలను ఎదుర్కొంటోంది పీఎఫ్ఐ. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకులను, బీజేపీ నాయకులను టార్గెట్ చేసినట్లుగా మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ వర్గాలు తెలిపాయి.

వచ్చే దసరా సందర్భంగా బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని వారి కదలికలపై నిఘా పెట్టాలని పీఎఫ్ఐ భావించినట్లు మహారాష్ట్ర ఏటీఎస్ తెలిపింది. ఆర్ఎస్ఎస్ నాగ్ పూర్ ప్రధాన కార్యాలయం పీఎఫ్ఐ లక్ష్యాల్లో ఉంది. దసరా సందర్భంగా ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు పీఎఫ్ఐ ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

గతవారం ఎన్ఐఏ, ఈడీలు 11 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో పీఎఫ్ఐ సంస్థపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. 106 మంది పీఎఫ్ఐ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంది. వారి కార్యాలయాల నుంచి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ డివైసెస్, మొబైల్స్, కంప్యూటర్లను స్వాధీనం చేసుకుంది. పీఎఫ్ఐ దేశంలో ఉద్రిక్తత పెంచేందుకు ప్రయత్నిస్తోందని.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. ఇటీవల పీఎఫ్ఐ కేసులో అరెస్ట్ అయిన వారిలో మహారాష్ట్ర నుంచి 20 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సంస్థను నిషేధించాలని డిమాండ్లు వస్తున్నాయి. పలు ముస్లిం సంస్థలు కూడా ఈ డిమాండ్ కు మద్దతు ఇస్తున్నాయి.

మరోవైపు పీఎఫ్ఐ కార్యకర్తల అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లో పీఎఫ్ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నాయి. ఇదిలా ఉంటే పీఎఫ్ఐ అరెస్టుల తర్వాత నుంచి తమిళనాడు వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ కార్యాలయాలే లక్ష్యంగా పెట్రోల్ బాంబుల దాడులు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here