దేశంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగంపై ఆగస్టు 5న నల్లబట్టలు ధరించి కాంగ్రెస్ చేపట్టిన నిరసనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కొందరు నిరాశ, నిస్పృహల్లో మునిగి చేతబడిని ఆశ్రయిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. చేతబడిపై నమ్మకం ఉన్నవాళ్లు ఎప్పటికీ తిరిగి ప్రజల విశ్వాసం పొందలేరని అన్నారు. రూ.900 కోట్లతో పానిపట్‌లో రూపొందించిన సెకండ్ జనరేషన్ ఇథనాల్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన అనంతరం ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉచిత హామీలతో రాజకీయాలు చేస్తున్న పార్టీలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఉచితాల వల్ల నూతన టెక్నాలజీలో పెట్టుబడులకు విఘాతం కలుగుతుందన్నారు.
‘ఆగస్టు 5న మాయమాటలు ప్రచారం చేయడం చూశాం. నల్ల బట్టలు వేసుకోవడం వల్ల తమ వైరాగ్య కాలం ముగిసిపోతుందని వారు అనుకుంటున్నారు.. కానీ ఎంతటి మాయమాటలు చెప్పినా, చేతబడులు, మూఢనమ్మకాలతో ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేరు.” అని ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని తన ప్రసంగంలో చెప్పారు. అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశం మొత్తాన్ని త్రివర్ణ పతాకంలో చిత్రీకరిస్తున్న సందర్భంగా జరిగిన ఒక సంఘటనపై దేశం దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. ఈ పవిత్ర సందర్భాన్ని కించపరిచే ప్రయత్నం జరిగిందని, “మన వీర స్వాతంత్ర్య సమరయోధులను కించపరిచే” ప్రయత్నం జరిగిందని, అలాంటి వ్యక్తుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు.
పెట్రోల్, నిత్యావసరాలు, జీఎస్టీ పెంపు, నిరుద్యోగం, అగ్నిపథ్ వంటి అంశాలపై కాంగ్రెస్ ఈనెల 5వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ నివాసం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ చేపట్టే ప్రయత్నం చేశారు. దిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయం సహా పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు కొనసాగాయి. ఈ క్రమంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహా అంతా నలుపు దుస్తులు ధరించి, నిరసన చేపట్టారు. పార్లమెంట్‌కు నలుపు దుస్తుల్లోనే హాజరయ్యారు. కాగా పోలీసులు అరెస్టులతో ఆ నిరసనలను ఎక్కడికక్కడ కట్టడి చేశారు.
ధరల పెరుగుదలపై ఆగస్టు 5న కాంగ్రెస్ నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు తమ బుజ్జగింపు రాజకీయాల కోసమే ఈ నిరసన చేపట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రామజన్మభూమికి శంకుస్థాపన చేసిన రోజు ఆగస్టు 5న వారు ఎంచుకోవడమేంటన్నారు. ఆ రోజు ఎందుకు నిరసన తెలియజేశారో అర్థం కావడం లేదన్నారు. .550 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు శాంతియుత పరిష్కారం లభించిన తర్వాతే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని అన్నారు.