నేడే భారత రాష్ట్రపతి ఎన్నిక.. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్

0
134

భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పార్లమెంట్. వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ జరగనుంది. 4,800 మందికి పైగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయనున్నారు. బ్యాలెట్‌ బాక్సులను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్రాలకు తరలించడంతో పాటు అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ నెల 21న పార్లమెంట్‌హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు. ఎన్డీఏ తరఫున గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల నుంచి యశ్వంత్‌ సిన్హా బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏకంగా 60 శాతానికి పైగా ఓట్లు కూడగట్టుకున్న ముర్ము మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేలా కన్పిస్తున్నారు. మొత్తం 10,86,431 ఓట్లలో ఆమెకు 6.67 లక్షల పై చిలుకు ఓట్లు ఇప్పటికే ఖాయమయ్యాయి.

ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము గెలుపు ఇప్పటికే ఖాయమైంది. మెజార్టీ ఎంతన్న అంశంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. భాజపా, ఎన్డీయే కూటమి పక్షాలతోపాటు, బీజేడీ, వైకాపా, బీఎస్‌పీ, ఏఐఏడీఎంకె, జేడీఎస్‌, తెదేపా, అకాలీదళ్‌, శివసేన, జేఎంఎం పార్టీలు ముర్ముకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు 60 శాతానికి పైగా ఓట్లు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఈ ఎన్నికల కోసం పార్లమెంటు సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు ఈ నెల 21న వెలువడనున్నాయి. భారత నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఓటింగ్‌ బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో జరుగుతుంది. ప్రస్తుత ఎన్నికలు దామాషా నిష్పత్తిలో జరుగనున్నందున ఒక్కో ఓటరు పోటీ ఉన్న ఇద్దరు అభ్యర్థులకు తన ప్రాధాన్యత సంఖ్యను ఇవ్వొచ్చు. ఈ ఎన్నికల్లో ఎంపీలకు ఆకుపచ్చ రంగు, ఎమ్మెల్యేలకు గులాబి రంగు బ్యాలెట్‌ పేపర్‌ సరఫరా చేయనున్నారు. ఓటింగ్‌ సమయంలో వాడే పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తుంది. ఆ పెన్నుతోనే ఓటేయాల్సి ఉంటుంది. వేరే దాంతో వేస్తే ఆ ఓటు రద్దవుతుంది. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్‌ జారీచేయకూడదు. ఓటేయడానికి, గైర్హాజరు కావడానికి ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.

రాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్‌ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, దిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులుంటారు. వీరంతా ఓటు హక్కు ద్వారా ప్రథమ పౌరుడిని ఎన్నుకొంటారు. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని నామినేటెడ్‌ సభ్యులు, రాష్ట్రాల శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్‌ కాలేజీలో ఉండరు. అందుకే వాళ్లకి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. ఉపరాష్ట్రపతిని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు మాత్రమే ఎన్నుకొంటారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీతో పాటు ఏపీ అసెంబ్లీలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ లేనందున ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700కు తగ్గింది. ఇక ఎమ్మెల్యేల ఓటు విలువలో 208తో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. 176తో జార్ఖండ్, తమిళనాడు రెండోస్థానంలో, 175తో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. సిక్కిం ఎమ్మెల్యేల ఓటు విలువ అతి తక్కువగా 7గా ఉంది. పార్లమెంటులోనూ, రాష్ట్రాల్లోనూ, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం ఎలక్టోరల్‌ కాలేజీలో 776 ఎంపీలు ఉన్నారు. వారి ఓట్ల విలువ 5,43,200. ఇక 4033 ఎమ్మెల్యేలు ఉంటే.. వారి ఓట్ల విలువ 5,43,231గా ఉంది. ఈ ఓట్ల విలువలో ఎన్డీయేకి 49%, యూపీయేకి 24.02%, ఇతర పార్టీలకు 26.98% బలం ఉంది. గతంలో కంటే ఈ సారి ఎన్డీయే బలం కొంత ఎక్కువగానే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here